వంగర గురుకుల విద్యార్థిని ఆత్మహత్యపై కౌశిక్ రెడ్డి విమర్శలు
హుస్నాబాద్ నియోజకవర్గంలోని వంగర గురుకుల స్కూల్‌లో విద్యార్థిని శ్రీవర్షిత ఆత్మహత్య చేసుకున్న ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాదానికి స్కూల్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, వార్డెన్‌ల వేధింపులే కారణమని ఆయన ఆరోపించారు.
తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ — “శ్రీవర్షిత అనే విద్యార్థిని స్కూల్‌లో జరుగుతున్న అవకతవకలను చూసి ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ చేత టార్చర్‌కు గురైంది. నిన్న సాయంత్రం 6:30 గంటలకు తల్లిదండ్రులతో మాట్లాడి, ఒక గంట తర్వాత సూసైడ్ చేసుకుంది. అంతేకాక, ఆమె మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తరలించడం అత్యంత నిర్లక్ష్యానికి నిదర్శనం” అని తెలిపారు.
హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన శ్రీవర్షిత ఆత్మహత్యకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇప్పటివరకు గురుకులాల్లో 110 మంది విద్యార్థులు చనిపోయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. శ్రీవర్షితను టార్చర్ చేసిన ప్రిన్సిపాల్, వార్డెన్‌లను వెంటనే సస్పెండ్ చేయాలి. కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి” అని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
అలాగే, “సైదాపూర్ స్కూల్‌లో విద్యార్థులను ఎలుకలు కరిస్తే పట్టించుకునే నాధుడు లేడు. గురుకుల ప్రిన్సిపాల్స్, టీచర్ల దగ్గర సీఎం రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకుంటున్నారా?” అని ఆయన నిలదీశారు.

