Home Page SliderNationalPolitics

ఇండియా కూటమిపై కశ్మీర్ ముఖ్యమంత్రి ఫైర్

ఇండియా కూటమి పార్టీలపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఫైర్ అయ్యారు. అసలు ఇండియా కూటమి ఏర్పాటు చేసింది దేనికి? అని ప్రశ్నించారు. గతంలో జరిగిన హర్యానా ఎన్నికలలోనూ, జరగబోయే ఢిల్లీ ఎన్నికలలోనూ ఆప్, కాంగ్రెస్ పార్టీలు వేరు కుంపటి పెట్టుకుని పోటీ చేస్తున్నాయి. అధికార బీజేపీ పార్టీని, ఎన్‌డీఏ కూటమిని ఎదుర్కొనే ఉద్దేశంతో పెట్టిన ఈ కూటమి ఇప్పుడు ఏ మాత్రం విలువలు లేకుండా ప్రవర్తిస్తోందని విమర్శించారు. ఈ కూటమి కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసమే ఏర్పాటు చేసినట్లుందని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇక రద్దు చేయడం మంచిదన్నారు. ఒకసారి కూడా సభలు, సమావేశాలు కలిసి ఏర్పాటు చేయలేదని, కూటమికి ఒక ఎజెండా లేదని మండిపడ్డారు. అయితే కశ్మీర్ ఎన్నికలలో కాంగ్రెస్, ఎన్సీ పార్టీలు కలిసే పోటీ చేశాయి. ఈ ఎన్నికలలో ఎన్సీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయినా కూడా హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోవడం వల్ల ఈవీఎంలపై విమర్శలు కురిపించింది కాంగ్రెస్ పార్టీ. ఈవీఎంల హ్యాకింగ్ విషయంలో కాంగ్రెస్‌తో అప్పుడే విభేదించారు ఒమర్ అబ్దుల్లా. అనంతరం రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమంటూ కేంద్రమంత్రి అమిత్‌షాను కలిశారు. దీనితో కాంగ్రెస్ పార్టీ కశ్మీర్ ముఖ్యమంత్రి ఇండియా కూటమికి దూరమవుతున్నారని విమర్శలు మొదలు పెట్టింది.