తెలంగాణా బీజేపీ నుండి కార్తికేయ-2 నిర్మాత పోటీ
దక్షిణాది రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ రాష్ట్ర అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణాలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులను సంప్రదిస్తూ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన యువనిర్మాత అభిషేక్ అగర్వాల్‌ను బీజేపీ తరపున తెలంగాణాలో బరిలో దింపే ప్రయత్నం చేస్తోంది.

కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అభిషేక్ మరోసారి కార్తికేయ-2 సినిమాతో ఘన విజయం సాధించాడు. ఈ రెండు సినిమాలూ హిందూ కాన్సెప్ట్‌తో వచ్చినవే. ఈయనకు విశ్వహిందూ పరిషత్, RSSలతో మంచి అనుబంధం ఉంది.

అందువల్ల ఇతనిపై బీజేపీ దృష్టి పెట్టింది.రానున్న ఎన్నికలలో అభిషేక్‌ను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కీలక స్థానం నుండి అసెంబ్లీ బరిలోకి దించేందుకు తెలంగాణా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈయన కూడా ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ఓ నియోజక వర్గం నుండి పోటీ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారని పేర్కొంది. త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తామని తెలిపింది.