News

కర్నాటక ఎలక్షన్స్ పోస్ట్‌మార్టమ్… ఎందుకు? ఏమిటి? ఎలా?

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అనుసరించే వ్యూహం వచ్చే రోజుల్లో ఆ పార్టీ భవిష్యత్‌ను నిర్దేశించనున్నాయి. ముందుగా ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య, రాష్ట్ర పార్టీ అధినేత డీకే శివకుమార్‌ల మధ్య సమతూకం సాధించడం కాంగ్రెస్‌కు పెద్ద సవాలు. వీరిద్దరూ బలమైన అనుచరులు ఉన్న శక్తివంతమైన నాయకులు, వారు సంవత్సరాలుగా విభేదాలు ఉన్నప్పటికీ పార్టీ కోసం ఐక్యంగా పనిచేసారు. ఫలితాల ప్రకటనకు ముందే, సీఎం పీఠం విషయమై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి, రాష్ట్ర పార్టీ చీఫ్ డికె శివకుమార్ సీఎం పీఠం దక్కించుకోవాలని ప్రయత్నిస్తుండగా, మళ్లీ ఆ పదవిని చేపట్టాలని సిద్ధరామయ్య కుమారుడు చేసిన వ్యాఖ్యపై తీవ్రంగా ప్రతిస్పందించారు. సీఎం ఎవరన్నదానిపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని శివకుమార్ అన్నారు. ఇవాళ కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశాన్ని పిలిచి, ఎమ్మెల్యేలందరినీ బెంగళూరుకు చేరుకోవాలని కోరింది. అభ్యర్థులకు ఎలా రియాక్ట్ కావాలో తెలియజేస్తామని.. హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు.

ఫలితాల తర్వాత, “ద్వేషం మార్కెట్ మూసివేయబడింది. ప్రేమ దుకాణాలు తెరవబడ్డాయి” అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్ర ప్రాంతాల్లో పార్టీ దాదాపు 99% సీట్లను గెలుచుకుందని ఖర్గే చెప్పారు. ఇంతటి విజయాన్ని ఆయన వల్లే సాధ్యమయ్యిందన్నారు. ఇక సీఎం పదవికి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రాజీనామా చేశారు. మధ్యాహ్నం తర్వాత ఓటమిని అంగీకరించిన ఆయన, ప్రధాని, బీజేపీ కార్యకర్తలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ,అనుకున్న విధంగా ఫలితాలు రాబట్టలేకపోయామన్నారు. లోక్‌సభ ఎన్నికలలో తిరిగి పార్టీ విజయం కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. జనతాదళ్ సెక్యులర్ నాయకుడు హెచ్‌డి కుమారస్వామి మాట్లాడుతూ.. ‘నేను చిన్న పార్టీని, నాకు డిమాండ్ లేదు.. మంచి అభివృద్ధిని ఆశిస్తున్నాను’ అని అన్నారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే JDS కింగ్‌మేకర్‌గా ఉంటుందని అంచనా వేయగా, ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇవ్వడంతో జేడీఎస్ నేతల నోళ్లు మూతబడ్డాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని హై-పిచ్ ప్రచారం, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ ఫలితం లభించలేదు. దాదాపు 40 ఏళ్లుగా ఉన్న పద్ధతిని ప్రజలు తిరిగి పునరుద్ధరించారు. అధికారంలో ఉన్న వ్యక్తిని దించడమన్నది కర్నాటక ఆనవాయితీగా వస్తోంది. ప్రధాని మోదీ రాష్ట్రంలో 19 బహిరంగ సభలు, ఆరు రోడ్‌షోలు నిర్వహించిన, ప్రజల ఆలోచనలను మార్చలేకపోయారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలు, ఈ ఏడాది చివర్లో జరగనున్న మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్నాటక ఫలితాలు కాంగ్రెస్‌కు ఊపునిస్తాయని భావించవచ్చు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ఆ పార్టీ తిరిగి విజయం సాధించాలని భావిస్తోంది. జ్యోతిరాదిత్య సింధియా, అతని విధేయుల ఫిరాయింపులతో 2020లో దాని ప్రభుత్వం కుప్పకూలిన మధ్యప్రదేశ్‌‌లో తిరిగి గెలవాలని కూడా అది ఆశిస్తోంది.

వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికల దృష్ట్యా ఈ ఫలితాలు బీజేపీకి కీలకం. రాష్ట్రంలో 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం తగ్గనప్పటికీ, వక్కలిగ, షెడ్యూల్డ్ కులాలు, తెగల ఓట్లలో ఆ పార్టీ ఓట్లను పొందలేకపోయింది. లింగాయత్‌ల మద్దతు కోల్పోయినట్టు తాజా ఫలితాలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్‌ విజయం విపక్షాలకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందని చెప్పొచ్చు. కర్నాటక నుండి వచ్చిన సందేశం ఏంటంటే, బీజేపీ ప్రతికూల, మతతత్వ, అవినీతి, ధనిక-ఆధారిత, మహిళా-యువత వ్యతిరేక, సామాజిక విభజన, తప్పుడు ప్రచారం, వ్యక్తివాద రాజకీయాల ‘అంతం’ ప్రారంభమైంది’ అని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు.