Home Page SliderNational

ఆ ఇద్దరే కాదు, సీఎం రేసులో మూడో వ్యక్తి

డీకే శివకుమార్ లేదా సిద్ధరామయ్యలో ఎవరికి సీఎం పీఠం ఇవ్వాలన్నదానిపై కాంగ్రెస్ హైకమాండ్ తర్జనభర్జనపడుతుంటే… మరో వర్గం మాకు సీఎం పదవి కావాలంటూ కాంగ్రెస్ హైకమాండ్‌కు విజ్ఞప్తి చేస్తోంది. ఇద్దరి నేతల మధ్య విభేదాల్లేకుండా హైకమాండ్ వ్యూహాలు రచిస్తుంటే… సీఎం పీఠం కోసం వివిధ కుల సమూహాల నుండి కొత్త వాదనలు విన్పిస్తున్నాయి. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 34 మంది లింగాయత్‌లు ఉన్నారని, ఆ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అఖిల భారత వీరశైవ మహాసభ గుర్తు చేస్తోంది. అత్యున్నత పదవికి, ఆ వర్గం వ్యక్తిని పరిశీలించాల్సిందిగా కోరుతోంది. ఒకప్పుడు బీజేపీకి కీలక మద్దతుగా ఉన్న లింగాయత్ ఓట్ల, ఈసారి కాంగ్రెస్ గెలుపునకు దోహదపడ్డాయి.

అదే సమయంలో దళితుల నుంచి మరో వాదన కూడా వస్తోంది. దళిత నేతను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత జి. పరమేశ్వర మద్దతుదారులు ప్రదర్శన నిర్వహించారు. తుమకూరులో జరిగిన సభలో ‘దళితుడు సీఎం కావాలి’ అని రాసి ఉన్న ప్లకార్డులు చేతబట్టారు. అఖిల భారత వీరశైవ మహాసభ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు రాసిన లేఖలో తమ సామాజికవర్గానికి చెందిన 46 మంది అభ్యర్థులను నిలబెట్టగా, వారిలో 34 మంది విజయం సాధించారని పేర్కొంది. కీలకమైన లింగాయత్ నాయకులు మహాసభలో సభ్యులుగా ఉన్నారు. దీనికి అధ్యక్షుడుగా 91 ఏళ్ల శామనూరు శివశంకరప్ప, ఈసారి దావణగెరె సౌత్ నుంచి ఎన్నికైన వారిలో వృద్ధుడు. ఇంకా, ఇతర 50 నియోజకవర్గాలలో ఇతర చిన్న వర్గాలను ఎన్నుకోవడంలో మా సంఘం ప్రధాన పాత్ర పోషించిందని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నామంటూ లేఖలో పేర్కొన్నారు శివశంకరప్ప. బీజేపీకి చెందిన సాంప్రదాయ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి విధేయతను మార్చినట్లు లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 134 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడంలో వీరు కీలకమని లేఖలో వెల్లడించారు.


కర్నాటక జనాభాలో 17 శాతం ఉన్న లింగాయత్‌లు దాదాపు 100 సీట్లలో ఫలితాలను తారుమారు చేయగలరు. ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు వారి మద్దతు కోసం పోటీపడ్డాయి. లింగాయత్ నాయకులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాయి. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ వర్గం ఓట్లను కొల్లగొట్టాలంటే లింగాయత్‌లకు సీఎం పీఠం అప్పగిస్తే బాగుంటుందని ఆ వర్గం నాయకులు కాంగ్రెస్ పెద్దలకు వివరిస్తున్నారు. అదే సమయంలో కేబినెట్ బెర్త్‌లు ఖరారు విషయంలోనూ లింగాయత్‌లకు అగ్రతాంబూలం దక్కేలా చూడాలని వారు కోరారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఇప్పటికే మాజీ సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ హోరాహోరీ తలపడుతున్న తరుణంలో తాజా డిమాండ్లు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరికొందరు తాము సైతం సీఎం రేసులో ఉన్నామంటూ చెప్పడం ద్వారా హైకమాండ్‌పై ఒత్తిడి పెరుగుతోంది.

ఒకప్పుడు బీజేపీకి కీలక మద్దతుగా ఉన్న లింగాయత్‌లు ఈసారి కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంతో ఆ సామాజికవర్గం ఆధిపత్యం ఉన్న స్థానాల్లో ఫలితాలు రివర్స్ అయ్యాయి. ఎన్నికలకు రెండ్రోజుల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ ఈ ఎన్నికల్లో లింగాయత్‌లు ఈసారి కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారని చెప్పారు.
లింగాయత్‌లు ఈసారి బీజేపీ నుంచి కాంగ్రెస్ వైపునకు మళ్లడానికి కూడా అనేక కారణాలను చెబుతున్నారు. అవినీతి ఆరోపణలపై కర్నాటకలో బీజేపీ ముఖ్యనేత, అతిపెద్ద లింగాయత్ నాయకుడు బీఎస్ యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా తొలగించడాన్ని కూడా పరిగణించాలి. అతని స్థానంలో మరో లింగాయత్ నాయకుడు బసవరాజ్ బొమ్మైని నియమించనా, ఎన్నికల్లో మాత్రం అందుకు తగినట్టుగా ఫలితాలు రాలేదు. చివరి నిమిషంలో ముస్లింలకు 4% రిజర్వేషన్‌ను రద్దు చేసి లింగాయత్‌లు, వొక్కలిగలకు పంచడం కూడా రాజకీయంగా బీజేపీకి ప్రతికూల ఫలితాలకు కారణమయ్యింది. ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ముందూ, వెనుకా, ఆలోచిస్తోంది.

బలమైన ఎన్నికల యంత్రాంగం ఉందన్న కారణంగా బీజేపీ పార్టీలోని కర్నాటక నేతను ఎవరిని కూడా ప్రొజెక్ట్ చేయకపోవడాన్ని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో కాంగ్రెస్ మాత్రం డీకే శివకుమార్, సిద్ధరామయ్యతోపాటుగా ఏఐసీసీ చీఫ్ ఖర్గేల త్రయంతో కర్నాటక మొత్తం చుట్టేసింది. శివకుమార్ దక్షిణ కర్నాటకలో ఆధిపత్యం చెలాయించే ప్రభావవంతమైన వొక్కలిగ కమ్యూనిటీకి చెందినవారు. సిద్ధరామయ్య కురుబ, మధ్య, ఉత్తర కర్నాటకలో గణనీయమైన ఉనికిని కలిగి ఉన్న వెనుకబడిన కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే దళిత మూలాలతో, కర్నాటక జనాభాలోని భారీ భాగాన్ని ఆకర్షించగలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ముగ్గురు త్రయం కాంగ్రెస్ ప్రచారానికి భారీగా లబ్ది చేకూర్చింది. హస్తం విజయానికి మార్గం సుగమం చేసింది. ఐనప్పటికీ, సీఎం పీఠం కోసం నేతలు ఎవరికి తోచిన విధంగా వారు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు.