ఒకే వేదికపై కాంబ్లీ, సచిన్.. అయితే ఏం జరిగిందంటే..
బాల్య స్నేహితులైన వినోద్ కాంబ్లీ, సచిన్ టెండూల్కర్ ఇద్దరూ తాజాగా ఒకే వేదికపై కలుసుకున్నారు. ముంబైలోని శివాజీ పార్క్ తమ గురువు, కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారక చిహ్నం ఆవిష్కరణలో భాగంగా వీరిద్దరు కలుసుకున్నారు. సచిన్, కాంబ్లీ ఇద్దరూ అచ్రేకర్ విద్యార్థులే. స్కూల్ క్రికెట్ రోజుల్లోనే ఇద్దరూ రికార్డులు బద్దలు గొట్టారు. ఇద్దరూ కలిసి 664 పరుగుల భాగస్వామ్యంతో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. సచిన్ ఆ తర్వాత కూడా అదే ఫామ్ కొనసాగిస్తూ ప్రపంచ దిగ్గజ క్రికెటర్ గా పేరు సంపాదించుకోగా, కాంబ్లీ పేరు ఆ తర్వాత మసకబారింది. తాజాగా వైరల్ అయిన వీడియోలో కాంబ్లీని పలకరించేందుకు టెండూల్కర్ వెళ్లాడు. అనంతరం తిరిగి స్టేజిపైకి వెళ్తుండగా సచిన్ చేయి వదిలేందుకు కాంబ్లీ ఇష్టపడలేదు. ఇద్దరూ కాసేపు అలాగే చేతులు పట్టుకుని ఉండిపోయారు. అయితే, హోస్ట్ పలుమార్లు టెండూల్కర్ ను స్టేజిపైకి ఆహ్వానించడంతో బలవంతంగా వెళ్లక తప్పలేదు. మరో వీడియోలో టెండూల్కరు కాంబ్లీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం కనిపించింది.