మరోసారి వార్తల్లో కామారెడ్డి ఎమ్మెల్యే, రోడ్డు విస్తరణకు సొంత ఇల్లు కూల్చివేత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విక్టరీ సాధించిన కాటిపల్లి వెంకట రమణారెడ్డి నాటి నుంచి నేటి వరకు వార్తల్లోనే నిలుస్తూ సంచలనం రేకెత్తిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాటి సీఎం కేసీఆర్, నేటి సీఎం రేవంత్ రెడ్డిని ఓడించి చరిత్ర సృష్టించిన ఆయన కొత్తగా రాష్ట్ర ప్రజలకు మరో ట్విస్ట్ ఇచ్చారు. ఎన్నికల్లో గెలవడం ఆ తర్వాత నియోజకవర్గ సమస్యలపై పోరాడటంతో ఆయన పాపులార్టీ రోజు రోజుకు పెరుగుతోంది.

తాజాగా ఆయన కామారెడ్డి పట్టణంలో రోడ్డు విస్తరణకు తన ఇల్లే అడ్డురావడంతో తనే ఇల్లును కూల్చివేతకు ఆమోదం తెలిపి, దగ్గరుండి మరి పనులను కానిస్తున్నారు. కామారెడ్డిలో పాతబస్టాండ్ నుంచి అడ్లూర్ వరకు రోడ్డు విస్తరణ ముందుకు సాగకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఈ ప్రాంతంలోనే ఎమ్మెల్యే కేవీఆర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇల్లు, రెండు సినిమా థియేటర్లు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాసం కూడా ఉన్నాయి.

రోడ్డు నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతుండటంతో, సొంతంగా ఎమ్మెల్యే ముందుకు వచ్చి ఇంటి కూల్చివేత పనుల్లో పాల్గొన్నారు. పది రోజుల క్రితమే ఇల్లు ఖాళీ చేసి క్యాంప్ కార్యాలయానికి మారారు. వెయ్యి గజాల ఇల్లును మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే స్వాధీనపర్చారు. గత ఏడాది క్రితం మాస్టర్ ప్లాన్ లో భాగంగా రోడ్ల వెడల్పుపై అధికార పార్టీ నాయకులతో కేవీఆర్ మాటల యుద్ధానికి దిగారు. ఇప్పుడు ఆయనే ముందుండి నిర్మాణాలను కూల్చడంతో ఇప్పుడు రోడ్డు నిర్మాణం పనులు ఏ మేరకు ముందుకు సాగుతాయో చూడాలి.

