అమెరికా అధ్యక్ష ఎన్నికలలో కమలా హారిస్ జోరు
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ఎన్నికల రేసులో శరవేగంగా దూసుకుపోతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌కు కుడిభుజంగా ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. వారం క్రితం అధ్యక్ష పదవికి ఆమెను ప్రతిపాదించినప్పటి నుండి తాజా సర్వేలలో రేసుగుర్రంలా పరుగులు తీస్తున్నారు. ఆసియా నుండి తల్లి, నల్లజాతి నుండి తండ్రి కలిగి ఉండడం ఆమెకు మంచి ఉపయోగంగా మారుతోంది. అమెరికాలో మెజారిటీ జాతులుగా ఉన్న ఈ రెండు వర్గాల ఓట్లు ఆమెకే రావచ్చని రాజకీయ నిపుణుల అభిప్రాయం. ఆగస్టులో జరిగే డెమొక్రాట్ల జాతీయ సదస్సులో ఆమె అభ్యర్థిత్వానికి ఆమోదముద్ర పడవలసి ఉంది. ఒకవేళ ఆమె అధ్యక్షురాలిగా ఎన్నికైతే 250 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన అమెరికా దేశంలో తొలి మహిళా అధ్యక్షురాలిగా మారనున్నారు. అంతేకాదు, తొలి నల్లజాతి మహిళగా కూడా గుర్తింపు తెచ్చుకుంటారు. ఉపాధ్యక్ష పదవిలో ఉంటూ అధ్యక్షునిగా ఎన్నికైన ఐదవ అమెరికన్‌గా కూడా నిలుస్తారు.