తెలంగాణకు గుదిబండగా కాళేశ్వరం ప్రాజెక్టు
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యద్భుతమైన ప్రాజెక్టుగా ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్రచారం చేసుకున్నారు. నేడు ప్రాజెక్టు కోసం వెచ్చించిన వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది. నీళ్లపాలైంది. 2014లో రూ. 40 వేల కోట్లతో ప్రాజెక్టు ప్రారంభించి, రూ. లక్షా 30 వేల కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచారు. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు, ప్రయోజనాలు మసకబారింది. గుదిబండగా మారింది. కాళేశ్వరం ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్టు అని కేసీఆర్ ప్రచారం చేసుకున్నారు. అది కేసీఆర్ ఫ్యామిలీకి మాత్రమే లాభం జరిగింది తప్పితే, ప్రజలకు జరిగిన ప్రయోజనమేమీ లేదు. భారీ అంచనాలతో, వేలకోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ప్రాజెక్టు నాలుగేండ్లలోనే పిల్లర్లు కుంగిపోయాయి. ప్రాజెక్టును పున:నిర్మాణం జరపాలని ఇంజనీర్లు చెబుతున్నారు. లేదంటే ప్రాజెక్టే దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు. యాంటీ గ్రావిటీ వాటర్ మేనేజ్ మెంట్ పేరుతో ప్రాజెక్టును నాసిరకం, నాణ్యత లేకుండా నిర్మించారు. నేషనల్ చానల్స్ లో గొప్పగా ప్రచారం చేసుకున్నారు. బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయిన విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి స్పందన లేదు. ప్రాజెక్టు వ్యయం, కాంట్రాక్టు విధానాలపై ఎలాంటి విషయాలను వెల్లడించకుండా అవినీతికి పాల్పడ్డారు. కాంట్రాక్టులు, కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. రైతులు, తెలంగాణ ప్రజలపై భారం మోపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ బ్యారేజ్ కు సంబంధించి15-20 మధ్య పిల్లర్లు కుంగిపోయినప్పుడు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాశానని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు మానిటరింగ్ కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంస్థను ఏర్పాటు చేసిందన్నారు కిషన్ రెడ్డి. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులను ఈ అథారిటీ స్టడీ చేస్తుందన్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులు డ్యాం వద్దకు వెళ్లి పరిశీలించారు. ప్రాజెక్టు పై పూర్తి వివరాలు అధ్యయనం చేసి రిపోర్ట్ అందజేశారు. 22 అంశాల గురించి అడిగితే 11 అంశాలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చిందన్నారు. 27న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కు ప్రాజెక్టు వివరాలు చెప్తే ప్రాజెక్ట్ భద్రతకు సూచనలు చేస్తామని చెప్పిందన్నారు. 9 అంశాలకు సంభందించిన రిపోర్ట్ లు ఇవ్వలేదన్నారు. తమ దగ్గర కనీస సమాచారం కూడా లేదంటూ రాష్ట్ర సర్కారు చెప్పడం దురదృష్టకరమన్నారు కిషన్ రెడ్డి. ప్లానింగ్, డిజైనింగ్, క్వాలిటీ సరిగా లేకనే కుంగిందని రిపోర్ట్ వచ్చింది. ఫౌండేషన్ సరిగా లేదని డ్యాం సేఫ్టీ అథారిటీ తెలిపిందన్నారు. ఫౌండేషన్ కోసం సింగిల్ స్టోన్ వాడటం కూడా ప్రమాదానికి కారణమన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్టుకు నాణ్యత లేని ఇసుక వాడారన్నారు. ఇంజనీర్లు చెప్పినా సీఎం కేసీఆర్ వినకుండా ప్రాజెక్టు నిర్మాణం చేసినందుకే ఇలా జరిగిందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు కాళేశ్వరానికి లైఫ్ లైన్.. ఇక్కడ నీరు లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా నిరుపయోగమేనన్నారు. నిజాయితీ ఉంటే ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణమైన ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలన్నారు. ప్రాజెక్టు ద్వారా రైతుకు ఎకరాకు వచ్చేది 40 వేలు అయితే.. ప్రాజెక్టు మెయింటేనన్స్ కు ఎకరాకు 85 వేలు ఖర్చు అవుతోందన్నారు.

ఇంత వ్యత్యాసం ఉందంటే.. ఈ ప్రాజెక్టును కమీషన్ల కోసం కట్టినట్లా? కాంట్రాక్టర్ల కోసం కట్టినట్లో చెప్పాలన్నారు కిషన్ రెడ్డి. లో క్వాలిటీ సాండ్ మెటీరియల్ వాడారని నిపుణుల నివేదికలో తేలిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిపుణులు, ఇంజినీర్ల మాటలు పక్కనపెట్టి తానే ఇంజినీర్ లాగా వ్యవహరించి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారన్నారు. కేసీఆర్ నిర్ణయాల వల్ల ప్రాజెక్టు నిరుపయోగంగా మారే ప్రమాదం ఉందన్నారు. పిల్లర్లు కుంగిపోవడంపై కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలన్నారు. కేసీఆర్ కమీషన్లు తీసుకోవడంలో, తెలంగాణ సొమ్ము దోచుకోవడంలో సక్సెస్ అయ్యారు.. కానీ ప్రాజెక్టు విషయంలో ఫెయిలయ్యారన్నారు. దీనిపై సమగ్రమైన విచారణ జరగాల్సి ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు పై ఏం చేస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కు తీరని నష్టం చేకూర్చే అవకాశం ఉందని రిపోర్ట్ లో తేలిందన్నారు. నిర్దిష్టమైన సమయానికి కేంద్ర ప్రభుత్వం అడిగిన వివరాలు ఇవ్వాలన్నారు. వివరాలు లేకపోతే మరింత తీవ్రమైన నేరంగా పరిగణించాలన్నారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాగానే ప్రాజెక్టు లోపాలపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామన్నారు. బాధ్యులు ఎంతటి వారైనా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

