News

కాయ్‌ రాజా కాయ్‌.. జోరుగా బెట్టింగ్‌లు

ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయం తమదేనని బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఘంటాపథంగా చెబుతున్నాయి. ఈ సస్పెన్స్‌ను బెట్టింగ్‌ రాజులు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు, అభిమానులు హైదరాబాద్‌ శివారులో అడ్డావేసి మునుగోడు గెలుపోటములపై బెట్టింగ్‌లు ప్రారంభించినట్లు సమాచారం. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నేతలు కూడా భారీగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. గెలుపోటములే కాదు.. డిపాజిట్‌ ఎవరికి దక్కుతుంది.. ఎవరికి దక్కదు.. అనే విషయంపైనా బెట్టింగ్‌లు జరగడం విశేషం. పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. వాళ్లను తప్పించుకొని మరీ పందెం కాస్తున్నారు. 10 వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకూ పందెంలో పెడుతున్నారు. తమ నాయకులు ఇంచార్జీగా ఉన్న చోట కూడా మెజారిటీ ఖాయమంటూ బెట్టింగ్‌ కాయడం విశేషం. ఇక్కడ క్రికెట్‌ మ్యచ్‌ కంటే ఎక్కువగా బెట్టింగ్‌లు జరగడం విశేషం.