మునుగోడు ఓటర్లకు కేఏ పాల్ షాక్..
మునుగోడు ఉప ఎన్నిక వాయిదా వేయాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిల్ వేశారు. ఉప ఎన్నికలో పార్టీలు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయని.. వెంటనే దీన్ని నియంత్రించాలని తన పిటిషన్ లో కోరారు. మునుగోడు ఉప ఎన్నికను వాయిదా వేయాలని కోరుతు తెలంగాణ హైకోర్టును అభ్యర్థించారు. మునుగోడు ఉప ఎన్నికపై సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేస్తామని కేఏ పాల్ తెలిపారు. అటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు పాల్. నామినేషన్లకు ముందే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కోట్లాది రూపాయలు వెదజల్లుతున్నాయని, ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయని, డబ్బులు, బహుమతులు పంచుతున్నాయని తన ఫిర్యాదులో ఆరోపించారు. కేఏ పాల్ పిటిషన్ పై కేంద్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుంది.. హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తోందన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాకా దాదాపుగా ఆపే పరిస్థితులు ఉండవంటారు. అయితే హైకోర్టు నుంచి డబ్బుల పంపిణి విషయంలో మాత్రం కీలక ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. ఉప ఎన్నికలో తమ పంట పండుతుందనే ఎన్నో ఆశతో ఉన్న మునుగోడు ఓటర్లు.. కేఏ పాల్ పిటిషన్ ఏం చేస్తోందోనన్న వర్రీలో ఉన్నారు.