జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్..
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో స్టోర్ రూమ్‌లో కోట్ల కొలది నోట్ల కట్టలు కాలిపోయి బయటపడిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు వెబ్‌సైట్ నుండి జస్టిస్ వర్మ పేరును తొలగించింది. అతనిని విధుల నుండి తొలగించింది. న్యాయపరమైన విధులకు దూరంగా ఉంచుతూ హైకోర్టు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ ఈ నిర్ణయం అమలులో ఉంటుందని పేర్కొంది. జస్టిస్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం సందర్భంగా పోలీసులు షేర్ చేసిన వీడియోలో కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే తమ ఇంట్లో నోట్లు దొరకడం, తన ప్రతిష్టను దెబ్బతీసే పన్నాగమని ఆయన పేర్కొన్నారు. ఆ గదిని పనివారు వాడతారని, పనికిరాని సామాగ్రి అక్కడ ఉంచడానికే వాడతామని తెలిపారు. తాము యూపీఐ యాప్‌లను వాడతామని, తమ కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాలు పరీక్షించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీజేఐ సంజీవ్ ఖన్నా ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.

