డీఎస్సీ 98 అభ్యర్థులకు న్యాయం చేయాలి!
సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన ఇరువురు అభ్యర్థులు
డీఎస్సీ 98 అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ ఆ బ్యాచ్ కు చెందిన ఇరువురు అభ్యర్థులు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి చినకాకానిలో బుధవారం చోటు చేసుకుంది. పులివెందుల కు చెందిన రమేష్ , నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్ అనే ఇద్దరు డిఎస్సీ అభ్యర్థులు సెల్ టవర్ ఎక్కి నిరసన చేపట్టారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్లు 5887 మందికి ఉద్యోగాలు ఇస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఈనెల 7వ తేదీన 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్ల షెడ్యూల్, కౌన్సెలింగ్ తేదీల్లో 4072 ఉద్యోగాలు మాత్రమే ప్రకటించారు. దీంతో దాదాపు 1800 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొంది. గత ఏడాది జూన్ నెల 17వ తేదీన సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న 6852 మందిలో ప్రతి ఒక్క అభ్యర్థికి ఉద్యోగం ఇస్తానన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి చివరకు చివరకు 4072 పోస్టులు కేటాయించారు. 2853 మంది ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. మాట ఇచ్చి మడమ తిప్పని సీఎం జగన్ ఇలా కొందరి అభ్యర్థులను తొలగించడాన్ని 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పటినుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డికి పలుమార్లు వారు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో నిరసన చేపట్టి అయినా తమ సమస్యను పరిష్కరించుకోవాలనే ఉద్దేశ్యంతో పులివెందుల కు చెందిన రమేష్, నెల్లూరుకు చెందిన శ్రీనివాస్ అనే ఇరువురు అభ్యర్థులు బుధవారం చినకాకాని వద్ద ఉన్న సెల్ టవర్ పైకి ఎక్కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీని చేత పట్టుకుని నిరసనకు దిగారు.