InternationalNews

భారత్‌కు జూనియర్ డొనాల్డ్ ట్రంప్… విషయం ఏంటంటే…!

అమెరికాకు చెందిన ది ట్రంప్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ జూనియర్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ జె ట్రంప్ కుమారుడు, ఈ నెలలో భారతదేశాన్ని సందర్శించనున్నారు. భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో విస్తరణలో భాగంగా పర్యటన ఉన్నట్టు తెలుస్తోంది. న్యూయార్క్‌కు చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్ ముంబైకి చెందిన ట్రిబెకా డెవలపర్స్‌తో భాగస్వామ్యం ద్వారా భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ప్రవేశించింది. ‘ట్రంప్’ బ్రాండ్ క్రింద లగ్జరీ ప్రాజెక్ట్‌లను నిర్మించడానికి US సంస్థ, ట్రిబెకా లోధా గ్రూప్‌తో సహా స్థానిక డెవలపర్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇప్పటివరకు, నాలుగు లగ్జరీ ప్రాజెక్ట్‌లు ప్రకటించారు. వీటిలో పూణేలో ఒకటి ఇప్పటికే పూర్తయింది.

ట్రిబెకా డెవలపర్స్ 10వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఈ నెలలో భారతదేశానికి వస్తారని భావిస్తున్నారు” అని ట్రిబెకా డెవలపర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్శన సమయంలో, డోనాల్ ట్రంప్ జూనియర్, ట్రిబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా ఇద్దరూ దేశంలో తమ వ్యాపార విస్తరణ ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉంది. ట్రంప్ ఆర్గనైజేషన్‌తో ట్రిబెకా వ్యాపార అనుబంధం 10 సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. కొద్దికాలంగా అది మరింతగా బలపడింది. డోనాల్డ్ ట్రంప్ జూనియర్ లేకుండా మా 10 సంవత్సరాల వేడుక పూర్తి కాదన్న మెహతా… ఆయన ఇండియా రావడం పట్ల సంతోషంగా ఉందన్నాడు. జూనియర్ ట్రంప్ పర్యటన సందర్భంగా… వ్యాపార విస్తరణ ప్రణాళికలను ప్రకటించాలని ప్లాన్ చేస్తున్నామన్నాడు.

ప్రస్తుతం, ఇండియాలో ట్రంప్ టవర్ ఢిల్లీ-NCR, ట్రంప్ టవర్ కోల్‌కతా, ట్రంప్ టవర్ పూణే, ట్రంప్ టవర్ ముంబై అనే నాలుగు ట్రంప్ ప్రాజెక్ట్‌లు చేస్తోంది. భారతదేశంలో, పంచశిల్ రియాల్టీతో కలిసి పుణెలో ట్రంప్ ఆర్గనైజేషన్ ఇప్పటికే ఒక లగ్జరీ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ముంబైలోని హౌసింగ్ ప్రాజెక్ట్ కోసం 2014లో లోధా గ్రూప్‌తో ఒప్పందం చేసుకుంది. నవంబర్ 2017లో, ట్రంప్ టవర్ కోల్‌కతాలో 140 అల్ట్రా-లగ్జరీ అపార్ట్‌మెంట్‌లతో ప్రారంభించారు. యునిమార్క్ గ్రూప్, RDB గ్రూప్, ట్రిబెకా డెవలపర్‌లతో దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. 2018లో ప్రారంభించబడిన హర్యానాలోని గురుగ్రామ్‌లో నాల్గో హౌసింగ్ ప్రాజెక్ట్‌ను రియల్టీ సంస్థ M3M అభివృద్ధి చేస్తోంది. ట్రంప్ టవర్స్‌తో పాటు, ఇతర బిల్డర్ల భాగస్వామ్యంతో ట్రిబెకా స్వతంత్రంగా కొన్ని ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది.