పూరీజగన్నాథుని రత్నభాండాగారంలో పాములపై జడ్జి క్లారిటీ
పూరీజగన్నాథుని రత్నభాండాగారంలో విషసర్పాలు, కాలనాగులు ఉన్నాయంటూ జరిగిన ప్రచారంపై హైకోర్టు జడ్జి క్లారిటీ ఇచ్చారు. ఒడిశా హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ సమక్షంలో 46 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఆలయ రహస్య గదిని తెరిచారు. ఈ గదిలో స్వామివారి అపూర్వ సంపదను లెక్కించడానికి 11 మందితో కూడిన బృందానికి ఆయన సారథ్యం వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ మేజిస్ట్రేట్ సమక్షంలోనే తాళాలు పగలగొట్టి తమ బృందం లోపలికి ప్రవేశించిందన్నారు. ఈ బృందంలో 8మంది ఆలయ మేనేజ్‌మెంట్ సిబ్బంది ఉన్నారని,వారు బహుడా యాత్ర సన్నాహాలలో ఉన్నందువల్ల తనిఖీ చేయడానికి, ఆభరణాల తరలింపుకు సమయం సరిపోలేదన్నారు. ఇక పాములు ఉన్నాయంటూ జరిగిన ప్రచారాన్ని కొట్టిపడేశారు. అలాంటివేవీ లేవన్నారు. ఈ దేవతామూర్తుల విగ్రహాలు, ఆభరణాలు, విలువైన రత్నాలను తరలించడానికి మరోతేదీ నిర్ణయిస్తారని పేర్కొన్నారు.