బీఆర్ఎస్ ఎంపీపై కత్తితో దాడి చేసిన విలేకరి
దుబ్బాక: బీఆర్ఎస్ ఎంపీ, ఆ పార్టీ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై ఓ యూట్యూబ్ ఛానల్ విలేకరి కత్తితో దాడి చేశాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఈ ఘటన జరిగింది. సూరంపల్లిలో ప్రభాకర్‌రెడ్డి ఇంటింటి ప్రచార కార్యక్రమం చేస్తుండగా, ఓ పాస్టర్ కుటుంబాన్ని పరామర్శించి బయటకు వస్తుండగా ఎంపీపై దాడి జరిగింది. ఆయనకు పొట్ట పైభాగంలో గాయాలయ్యాయి. కరచాలనం చేసేందుకు వచ్చిన దట్టని రాజు అనే వ్యక్తి ఉన్నట్టుండి తనవెంట తెచ్చుకున్న కత్తితో ఒక్క ఉదుటన ప్రభాకర్‌రెడ్డిపై విరుచుకుపడ్డాడు. దీంతో ఆయనకు రక్తం కారేలా గాయాలయ్యాయి. వెంటనే కార్యకర్తలు ఎంపీని వాహనంలో గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిది మిరుదొడ్డి మండలం పెద్దప్యాల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడు ఓ యూట్యూబ్ ఛానల్‌లో విలేఖరిగా పనిచేస్తున్నట్లు సమాచారం. నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు.
ప్రభాకర్‌రెడ్డిని తొలుత గజ్వేల్‌లోని ఆస్పత్రికి.. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. నారాయణఖేడ్ సభకు వెళ్తుండగా మంత్రి హరీష్‌రావుకు ఈ వార్త అందింది. దీంతో ఆయన వెంటనే గజ్వేల్ ఆస్పత్రికి బయలుదేరి వెళ్లారు. ఎంపీ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను, కుటుంబసభ్యులను ఫోన్‌లో కాంటాక్ట్ చేసి విషయాలను అడిగి తెలుసుకున్నారు.