Andhra PradeshHome Page Slider

రాక్షస పాలన అంతం కోసమే టీడీపీలో చేరా-కన్నా లక్ష్మీనారాయణ

రాజకీయ జీవితమంతా తాను చంద్రబాబును విమర్శించి.. ఇప్పుడు అదే పార్టీలో చేరడానికి తగిన కారణం ఉందన్నారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని… రాక్షస క్రీడను పారద్రోలాలంటే… ప్రజాస్వామ్యవాదులందరూ కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు కన్నా. ఒక్క అవకాశం ఇవ్వండని.. తండ్రిని మరపిస్తానని, అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి కూడా రాష్ట్ర సంపదను సెంట్రలైజ్ చేసుకొని, సీఎం జగన్ వ్యాపారం చేసుకుంటన్నాడన్నారు కన్నా. బడుగు వర్గాల సంక్షేమం జగన్‌కు పట్టదని… సంక్షేమం అంటే చాక్లెట్ లు పంచడమని భావిస్తున్నారన్నారు. పథకాలిస్తున్నా కాబట్టి నాకే ఓటేయాలంటున్నారని విమర్శించారు.

జగన్, భారతి సిమెంట్స్ నుంచి డబ్బులు తెచ్చి పంచుతున్నట్టు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంపై 9 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక కరెంట్ బిల్లుల నుంచి చెత్త పన్ను వరకు పెంచుకుంటూ పోయారన్నారు. ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి, అమ్మి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ప్రతిపక్షనేతగా ఉండి అమరావతికి ఆమోదం తెలిపి… అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు రాజధానులంటున్నారని విమర్శించారు. విశాఖ అయితే నోరుగా దోచుకోవచ్చని.. రాజధాని అంటున్నారని విమర్శించారు. వైసీపీ నేతలను చూస్తే… విశాఖ జనం భయపడుతున్నారన్నారు కన్నా. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకోవడంతోపాటు, అమరావతిని దృష్టిలో పెట్టుకొని… రాక్షసుడ్ని రాష్ట్రంలోంచి పారద్రోలాలనే టీడీపీలో చేరానన్నారు కన్నా. మోదీ ప్రధానిగా ఉన్న బీజేపీని కాదని.. రాష్ట్రం కోసం టీడీపీలో చేరానన్నారు.