NewsTelangana

మునుగోడులో జీవిత ప్రచారం

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ తరఫున ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత అయిన జీవిత రాజశేఖర్‌ ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. జీవితకు బీజేపీ సీనియర్‌ నేత ఈటల రాజేందర్‌ ఫోన్‌ చేసి మునుగోడులో ప్రచారం చేయాలని కోరినట్లు తెలిసింది. దీంతో ఈటల సతీమణి జమునతో కలిసి ప్రచారం చేసేందుకు జీవిత ప్లాన్‌ చేస్తున్నారు. ఇటీవల బీజేపీలో చేరిన జీవిత రాజశేఖర్‌ రానున్న ఎన్నికల్లో తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్‌లోని ఏదో ఓ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. మంచి వక్త కూడా అయిన జీవిత తనకు టికెట్‌ ఇస్తేనే ప్రచారం చేస్తానని చెప్పినట్లు, అందుకు బీజేపీ నాయకులు అంగీకరించినట్లు సమాచారం.