ఓటేసిన టీమ్ ఇండియా మాజీ బౌలర్ జవగల్ శ్రీనాథ్
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 21 శాతం ఓటింగ్ నమోదైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు యువ ఓటర్లు పెద్ద ఎత్తున వస్తున్నట్టుగా తెలుస్తోంది. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ జవగల్ శ్రీనాథ్ కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ రిఫరీగా వ్యవహరిస్తున్నారు. 224 అసెంబ్లీ స్థానాల్లో 2,615 మంది అభ్యర్థుల బరిలో నిలిచారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నటుడు ప్రకాష్ రాజ్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య, శివకుమార్, జగదీశ్ షెట్టర్ కూడా ఓటేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు 5 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు వేయనున్నారు. రాష్ట్రంలో అధికార బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. దక్షిణాదిన పట్టు నిలుపుకోవడానికి చరిత్రను తిరగరాయాలని బీజేపీ తహతహలాడుతోంది. కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నట్టు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

