శ్రీకాకుళంలో నేడు జనసేన “యువశక్తి శంఖారావం”
ఏపీలో జనసేన అధినేత రాష్ట్రవ్యాప్తంగా యువత సమస్యలపై పోరాడేందుకు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నుండి యువశక్తి కార్యక్రమంతో గురువారం శంఖారావం పూరించనున్నారు. గత రెండు వారాలుగా ఈ సభ ఏర్పాటు కోసం శ్రీకాకుళం జిల్లాకు చెందిన జనసేన నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారు. ఎచ్చర్ల నియోజకవర్గం లావేరు మండలం సుభద్రాపురం జాతీయ రహదారి పక్కన పొలాల్లో సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. గత రెండు వారాలుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గత నెలలో శ్రీకాకుళం, విజయనగరం ,విశాఖ జిల్లాలో నాదెండ్ల మనోహర్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతం చేయాలి అన్నదానిపై నాయకులకు దిశా నిర్దేశం చేశారు.

కొన్ని ఏర్పాట్లను పార్టీ నాయకులు నాగబాబు నాదెండ్ల మనోహర్ తో కలిసి బుధవారం పరిశీలించారు. నేడు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు సభ ఉంటుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుగా యువత నుండి సమస్యలు తెలుసుకుని ఆ తర్వాత ప్రసంగించనున్నారు. కొంతమంది యువకులతో ముందుగా వారి సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ప్రధానంగా యువత ఎక్కువగా ఉపాధి అవకాశాల కోసం వలసలు పోతున్నందున వారికి అదే ప్రాంతంలో ఉపాధి కల్పించేందుకు అవసరమైన పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో పాటు ఆ పార్టీకి చెందిన నాయకులు నాదెండ్ల మనోహర్ తదితరులు చెప్పడం జరిగింది

. దీంతోపాటు రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ కోసం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని యువత అభ్యున్నతి కోసం తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎటువంటి చర్యలు చేపడుతుందో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువశక్తి కార్యక్రమం ద్వారా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా స్పష్టం అవుతుంది. సినీ నటుడుగా పవన్ కళ్యాణ్ కు యువతలో మంచి ఆదరణ ఉండటంతో రానున్న ఎన్నికల్లో యువ ఓటర్లపై జనసేన దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందువలన యువశక్తి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని అందులో బాగా వెనుక బడిన ప్రాంతం నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి యువతను మరింత దగ్గరగా చేర్చుకునేందుకు జనసేన అధినేత ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

