తెలంగాణలో ఎన్నికల పోటీపై 2-3 రోజుల్లో జనసేన పార్టీ నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో పోటీపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని జనసేన ప్రకటించింది. హైదరాబాద్‌లోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఎన్నికల్లో పోటీపై పార్టీ నేతల అభిప్రాయాలను పవన్‌కు వివరించినట్లు రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది. కొత్త రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి తావివ్వరాదని గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నామని పేర్కొంది. మిత్రపక్షమైన బీజేపీ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు సైతం దూరంగా ఉన్నట్లు తెలిపింది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుంటే క్యాడర్ బలహీనపడే అవకాశం ఉందని పవన్ దృష్టికి తెలంగాణ జనసేన తీసుకెళ్లింది.
నేతల అభిప్రాయాలను విన్న పవన్ కళ్యాణ్.. తన మీద ఒత్తిడి ఉన్నమాట వాస్తవమేనని, నాయకులు, జన సైనికుల అభిప్రాయాలకు విలువ ఇస్తానని తెలిపారు. సరైన నిర్ణయం తీసుకోడానికి ఒకటి రెండు రోజుల సమయం అవసరమని తెలిపారు. ఈ మేరకు జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది. సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, తెలంగాణ శాఖ ఇన్‌ఛార్జి నేమూరి శంకర్‌గౌడ్, రాష్ట్ర నాయకులు రామ్ తాళ్లూరి, హైదరాబాద్ నగర అధ్యక్షుడు రాజలింగం, ప్రధాన కార్యదర్శి ఎం.దామోదర్ రెడ్డి, వివిధ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు సమావేశంలో పాల్గొన్నారు.