పవన్ కల్యాణ్ మాటలకు అర్థాలే వేరులే.. అర్థాలే వేరులే?
• జనసేన పదో ఆవిర్భావ దినోత్సవ సభ సక్సెస్
• విజయవాడ నుండి మచిలీపట్నం వరకు పవన్‌కు జయ జయ ద్వానాల మధ్య స్వాగతం
• తెలుగుదేశం పార్టీపై ప్రత్యేకమైన ప్రేమ ఏమీ లేదన్న పవన్ కళ్యాణ్
• డబ్బుకు అమ్ముడు పోయే రకాన్ని కాదని ఈసారి ఎన్నికల్లో గెలిచి తీరుతామని కీలక వ్యాఖ్యలు
రానున్న ఎన్నికల్లో గెలుస్తామని సంపూర్ణమైన విశ్వాసం కలిగితే ఒంటరిగానైనా పోటీకి సిద్ధమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే అందుకు పూర్తిస్థాయిలో నివేదికలు తెప్పించుకున్నాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీని బలి పశువును కానివ్వనని తనతో సహా పోటీ చేసే పార్టీ అభ్యర్థులంతా ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరుతారని ఆ దిశగా ప్రజలంతా అండగా నిలిచి జనసేనను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. మచిలీపట్నంలో జరిగిన జనసేన పదో ఆవిర్భావ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ పైన తనకు ప్రత్యేకమైన ప్రేమ ఏది లేదని తెలుగుదేశం పార్టీతో సీట్లు సర్దుబాటు అన్న మాట అవాస్తవమని చెప్పారు. తాను చెప్పిన ప్రకారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం పని చేసి ఉంటే అసలు తెలుగుదేశం పార్టీతో అవసరమే ఉండేది కాదన్నారు.

భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్రంలో జనసేన బీజేపీ కలిసి ఎదిగేందుకు స్పష్టతతో ఉందని కానీ రాష్ట్ర నాయకత్వం కలిసి రావడంలేదని పేర్కొన్నారు. ఆ కారణంగానే ఓటు చీల కూడదని ఏడాది క్రితం ప్రకటన చేయాల్సి వచ్చిందని అన్నారు. కానీ ఇప్పుడు ప్రజలంతా కులాలకు అతీతంగా ఆలోచించి జనసేనకు అధికారం కట్ట బెట్టాలన్నారు. ఇందులో కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని అన్ని కులాలను కడుపులో పెట్టుకొని దగ్గరకు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని తాను అమరావతికి 3 వేల ఎకరాలు చాలని చెప్పానని కానీ అప్పుడు అందరూ నీకు అభివృద్ధి అవసరం లేదా అని ప్రశ్నించారని ఇప్పుడు ఏమైందని రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందన్నారు. ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారని అసలు రాజధాని లేకుండా చేశారని ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖపట్నంను రాజధాని చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.

నిజాయితీగా, ఓపెన్ గా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేశానని పవన్ కల్యాణ్ అన్నారు. కానీ జగన్ ఢిల్లీకి వెళ్లి భారతీయ జనతా పార్టీకి మద్దతిస్తున్నారని దుయ్యబట్టారు. మద్యపానం నిషేధం అని చెప్పి మద్యం అమ్మితే ప్రజలు ప్రశ్నించకపోతే ఎలా అని అన్నారు. మొత్తానికి మచిలీపట్నంలో జరిగిన జనసేన పదో ఆవిర్భావ సదస్సు సక్సెస్ అయింది. పవన్ కళ్యాణ్ కొత్తగా రూపొందించిన వారాహి వాహనంపై విజయవాడ నుండి మచిలీపట్నం వచ్చారు. వీర మహిళలు, జనసైనికులు పవన్ కల్యాణ్‌కు ఘన స్వాగతం పలికారు. సభానంతరం జనసేన పార్టీలో కొత్త జోష్ కనిపించింది.