పోలీసులను ప్రశ్నించిన జనసేనాని…
ఏపీ సర్కార్ వర్సెస్ పవన్ కల్యాణ్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ సర్కారుపై గత కొద్ది రోజులుగా విమర్శలదాడి పెంచుతున్న పవన్ కల్యాణ్‌కు తాజాగా… విశాఖ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విశాఖలో సెక్షన్ 30 అమలవుతున్నా… జనసేన కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారని… 500 మంది వరకు పాల్గొన్నారని విశాఖ తూర్పు ఏసీపీ హర్షిత చంద్ర తెలిపారు. విశాఖ గర్జనకు హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో వైసీపీ మంత్రులపై జనసేన కార్యకర్తలు రాళ్లు రువ్వారు. దీంతో పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఐతే కావాలని తమ గొంతు నొక్కాలని చూస్తున్నారని జనసేన చీఫ్ ఆరోపించారు.
ఇక జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ ఎయిర్ పోర్టుకు రావడంతో అక్కడ జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఇప్పటికే వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం పెరగడంతో… జనవాణి కార్యక్రమం నిర్వహించకూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. ప్రజల కోసం పోరాడితే నోటీసులు ఇస్తున్నారన్నారు. విశాఖకు రాకముందే గొడవ జరిగితే.. మావాళ్లే గొడవ జరిగినట్టు నోటీసులిచ్చారంటూ మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా… జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమన్నారు. ప్రజల కోసం మాట్లాడటం తప్పా అంటూ ప్రశ్నించారు. నేర చరిత్ర ఉన్నవాళ్లను ఎన్నుకుంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయన్నారు.

