జమిలి రావచ్చు, సిద్ధంగా ఉండండి..జగన్
ఏపీలో 2027లోనే జమిలి ఎన్నికలు రావొచ్చని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. పార్టీ కేడర్‌లో జోష్ నింపేందుకు ఆయన పార్టీ మీటింగులో మాట్లాడారు. త్వరలోనే దేశంలో జమిలి ఎన్నికలు రావొచ్చని, అప్పుడు 2027లో ఏపీకి కూడా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగొచ్చని పేర్కొన్నారు. గ్రామ, బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ పార్టీని బలోపేతం చేయాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ ఏర్పడిన 15 ఏళ్లుగా మూడు సార్లు ఎన్నికలను ఎదుర్కొన్నామని, ప్రతిపక్షంలోనూ, అధికారంలోనూ కూడా ఉన్నామని గుర్తు చేశారు. గ్రామస్థాయి నుండి లోపాలను సరిదిద్దుకుంటూ పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకెళ్లాలని సూచించారు. కూటమి ఎన్నికల హామీలు గాలిమాటలేనని ప్రజలు గ్రహించారని, అదే సమయంలో వైసీపీ పార్టీ చేసిన మంచిపనులు కూడా గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజల్లోకి ధైర్యంగా తిరగే దమ్ము మన పార్టీకే ఉందన్నారు. కేవలం నాలుగు నెలల కాలంలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోందని, ప్రజలలో విశ్వాసం కోల్పోయారని పేర్కొన్నారు.