ఎక్కి ఎక్కి ఏడ్చిన జగ్గారెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా కార్యకర్తల సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్ మండలంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి వివాహానికి ఆహ్వానించడంతో పాటు, పార్టీ విషయాలు చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 7న సంగారెడ్డి పట్టణ రామాలయం వద్ద వివాహం జరగనుంది. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే జగ్గారెడ్డి గత సంఘటనలను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు సంగారెడ్డిలో రాహుల్ గాంధీ పబ్లిక్ మీటింగ్‌ను గ్రాండ్‌గా నిర్వహించిన సందర్భాన్ని ఆయన ప్రస్తావించారు. ఆ సమయంలో తన వద్ద డబ్బులు లేకపోయినా, పార్టీ కోసం కష్టపడిన నాయకుడు ఆంజనేయులు తన భూమిని అమ్మి డబ్బులు ఇచ్చిన దృశ్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ సంఘటన తలుచుకున్న జగ్గారెడ్డి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఎప్పుడూ జోష్‌లో కనిపించే ఆయన కళ్లలో నీరు కనిపించడంతో సమావేశానికి హాజరైన కార్యకర్తలు, నేతలు దిగ్భ్రాంతి చెందారు. “వద్దు సార్, మీరు ఇలా బాధపడకండి” అంటూ ఓదార్చే ప్రయత్నం చేశారు. అయితే భావోద్వేగం తాళలేక చివరికి సమావేశం మధ్యలోనే జగ్గారెడ్డి వెళ్లిపోవడం అక్కడ ఉన్న వారిని ఆవేదనకు గురి చేసింది.