Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page sliderNewsPoliticsTrending Todayviral

జగన్ పర్యటనలు కాదు.. పోరాటం అవసరం

  • . జగన్ ఓదార్పు యాత్రలు
  • . గెలుపుకు చేరువ కావాలంటే ప్రజాసమస్యలపై పోరాటం అవసరం
  • . పరామర్శల పేరుతో జైలు యాత్రలు
  • . 2019 ఎన్నికల ముందులా దీక్షలు, ధర్నాలు
  • .అధికార పార్టీ దూకుడుకు కళ్లెం వేయాలి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ జిల్లా పర్యటనకు మాత్రమే పరిమితం కాకూడదని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తేనే గెలుపుకు దగ్గరవుతారని రాజకీయ వేత్తలు సలహా ఇస్తున్నారు. ఆయన పర్యటనలలో ఊపు కనిపిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం వైసీపీ గత ఐదేళ్ల పాలనపై మాత్రం ప్రజల మనసుల నుంచి తొలగిపోలేదు. జిల్లా పర్యటనలు సక్సెస్ అయినంత మాత్రాన సరిపోదు. గ్రౌండ్ లెవెల్ లో ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కానీ జగన్ ఆ పని చేయకుండా తాను జిల్లాల్లో పర్యటిస్తూ కేవలం క్యాడర్, లీడర్ కు దగ్గరవుతున్నారు తప్పించి గత ఎన్నికల సమయంలో దూరమయిన వర్గాలను దగ్గరకు చేసుకునే ప్రయత్నం మాత్రం చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం పర్యటనలతోనే పార్టీకి హైప్ తెచ్చే ప్రయత్నం కొంత వరకూ సక్సెస్ అవుతుందేమో కాని, గెలిచేటంత లేదని మాత్రం వైసీపీ నేతలే చెబుతున్నారు. జగన్ జిల్లాల పర్యటనలు కూడా అధికార పక్షానికి విమర్శలు చేయడానికి ఊతమిచ్చే విధంగానే మారుతున్నాయి. పరామర్శల పేరుతో జగన్ జైలు యాత్రలు చేస్తున్నారు తప్పించి ప్రజలకు ఉపయోగపడే పర్యటనలు చేయడం లేదని పార్టీ నేతలే అంటున్నారు. ఇప్పటి వరకూ కేసులు నమోదయి జైళ్లలో ఉన్న నేతలను, జిల్లాల్లో పార్టీ ముఖ్య నేతల పరామర్శలకే పరిమితమవుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై జగన్ క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను పార్టీ నేతలకు, కార్యకర్తలకే వదిలేశారు. తాను మాత్రం ఇప్పటి వరకూ ప్రజా సమస్యలపై ఆందోళనకు మాత్రం దిగలేదన్నవిమర్శలు సొంత పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. రైతుల సమస్యలపై గుంటూరు, పొదిలి, బంగారు పాళ్యం వెళ్లినప్పటికీ ఎక్కువ యాత్రలు నేతల పరామర్శలకేనని అంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు జరిగిన విషయాలను ఈ సందర్భంగా నేతలు గుర్తు చేస్తున్నారు. గతంలో జగన్ వివిధ అంశాలపై నిరాహార దీక్షలతో పాటు ధర్నాలుకూడా చేశారని, కానీ ఇప్పుడు ఆందోళన విషయంలో మాత్రం పాలు పంచుకోకుండా నేతలకే అప్పజెప్పడంపై కొందరు నేతలు కూడా అభ్యంతరం తెలుపుతున్నారు. ఆ దీక్షలు.. ధర్నాలు జగన్ ను లీడర్ గా చేశాయి. కానీ ఇప్పుడు మాత్రం పరామర్శలకు, ఓదార్పు యాత్రలకు మాత్రమే పరిమితమవుతున్నారని, గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై అధికార పార్టీ దూకుడు పెంచుతుంటే జగన్ మాత్రం నిదానంగా వ్యవహరించడం మాత్రం క్యాడర్ ను కూడా ఒకింత అయోమయంలోకి నెడుతుంది. ఇప్పటికైనా జగన్ ప్రజా సమస్యలపై నేరుగా పోరాటం చేస్తే గెలుపునకు దగ్గరవుతామన్న కామెంట్స్ వినపడుతున్నాయి.