Andhra PradeshNews

2024లో క్లీన్ స్వీప్ దిశగా జగన్ వ్యూహాత్మక అడుగులు

ఏపీలో వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2024 ఎన్నికల్లో 175 నియోజకవర్గాలకు 175 స్థానాలు గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంతో వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తాడేపల్లి లోని తన నివాసంలో దీనిపై పెద్ద కసరత్తే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రతిపక్షాల ఆధీనంలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ లతో పాటు తమ పార్టీ తక్కువ ఓట్ల తేడాతో గెలిచిన నియోజకవర్గ సెగ్మెంట్ల లో పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి ప్రత్యర్థులను ఓడించేందుకు వారిలో విశ్వాసాన్ని నింపేలా ప్రయత్నిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ 23 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకోగా మరో 34 స్థానాల్లో పదివేల మెజార్టీ లోపే వైసీపీ గెలుపొందింది. దీంతో ఆ స్థానాలపై దృష్టి పెట్టిన జగన్ అక్కడ పరిస్థితులను సరిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష పార్టీ గెలుపొందిన 23 స్థానాలతో పాటు ప్రస్తుతం పార్టీకి తక్కువ మెజార్టీతో గెలిచిందని భావిస్తున్న 34 స్థానాలు కలిపి 57 స్థానాల్లో ముందుగా పార్టీని మరింత బలవపేతం చేయాలని ఆ దిశగా అడుగులు వేయాలని సీఎం జగన్ తన అంతరంగికులకు పార్టీ బాధ్యులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. దీంతోపాటు టీడీపి గెలిచిన నియోజకవర్గాలకు కూడా అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నారు.

ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో టీడిపి సాంప్రదాయ ఓటర్లను వైసీపీ వైపు ఆకర్షించాలనే ఉద్దేశంతో సీఎం జగన్ విపక్షాల ఆధీనంలో ఉన్న నియోజకవర్గాలకు నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా టీడీపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఓడించేలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. 1989 నుంచి అక్కడ విరామం లేకుండా గెలుస్తున్న చంద్రబాబు నాయుడు కు కుప్పం కంచుకోట అయినప్పటికీ అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. దీంతోపాటు అక్కడ వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న భరత్ కు జగన్ ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. భరత్ నేతృత్వంలో కుప్పం అభివృద్ధి సాధ్యం అనిపించేలా కుప్పం మున్సిపాలిటీకి 56 కోట్లు కూడా మంజూరు చేశారు. ఈసారి ఎన్నికల్లో ఎలా అయినా చంద్రబాబు నాయుడు ను ఓడించేలా అన్ని రకాల వ్యూహాలకు జగన్ పదును పెడుతున్నారు. ఇలా ఏపీలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పార్టీల రహితంగా అమలు చేస్తూ ఆయా నియోజకవర్గాల ప్రజల్లో వైసీపీకి ఆదరణ పెరిగేలా సీఎం జగన్ కృషి చేస్తున్నారు. టీడీపి గెలిచిన ఆ స్థానాల్లో కూడా పట్టు కోల్పోకుండా గెలిచే విధంగా తమ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పదేపదే జగన్ సూచిస్తూ వస్తున్నారు. మరి రానున్న ఎన్నికల్లో జగన్ వ్యూహాలు ఫలిస్తాయా లేదా అనేది చూడాల్సి ఉంది.