Andhra PradeshHome Page Slider

జగన్ ముందస్తు ఎన్నికల వ్యూహం

రాష్ట్రానికి రావాల్సిన నిధులు కోసం ప్రయత్నాలు మరింత వేగవంతం

రెండు వారాల వ్యవధిలోనే రెండు సార్లు ఢిల్లీకి వెళ్లిన జగన్

ఏప్రిల్ 3న పార్టీ ఎమ్మెల్యేలు సమన్వయకర్తలతో వర్క్ షాప్

తెలంగాణతో పాటు ఏపీలోను ఎన్నికలు జరిగే అవకాశం?

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను తేల్చేస్తారా ? ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగే తెలంగాణ ఎన్నికల తో పాటు ఏపీలో కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైయస్ జగన్ కూడా ముందస్తు ఎన్నికల కు వెళ్లే ఆలోచనలో ఉన్నారని అందులో భాగంగానే రెండు వారాల వ్యవధిలో వరుసగా రెండుసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసినట్లు వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే అంశంపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చర్చ విస్తృతంగా నడుస్తుంది. ముందస్తు వ్యూహంలో భాగంగానే జగన్ కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకొచ్చే ప్రయత్నాన్ని మరింత వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 17వ తేదీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, అమిత్ షా తదితర ముఖ్య నేతలతో భేటీ అయి వచ్చిన 48 గంటల్లోనే రాష్ట్రానికి సుమారు 5 వేల కోట్లకు పైగా నిధులను కేంద్రం విడుదల చేసింది. తాజాగా బుధ, గురువారాల్లో రెండు రోజులు పాటు జగన్ ఢిల్లీలో పర్యటించి అమిత్ షా తో పాటు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ను కలిశారు. ఈ సందర్భంగా పెండింగ్ నిధుల పైన ఆయన చర్చించడాన్ని బట్టి చూస్తుంటే కేంద్రం నుండి వీలైనంత త్వరగా రాష్ట్రానికి రావలసిన అన్ని రకాల నిధులను రాబట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న వ్యూహానికి పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. జగన్ ఢిల్లీకి వెళ్తున్నది నిధులు కోసమేనని వైయస్సార్సీపీలోని సీనియర్ నేతలు కూడా అంటున్నారు.

ముందస్తుకు వెళ్లే యోచనలో ఉన్నారని పలువురు నేతలు సైతం పరోక్షంగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత సీఎం జగన్ లో కూడా మరింత వేగం పెరిగింది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా జగన్ సంక్షేమ క్యాలెండర్ ను కూడా ప్రకటించారు. తూ. చా తప్పకుండా క్యాలెండర్ లో ఉన్న ప్రతి పథకాన్ని లబ్ధిదారులకు అందించి తీరుతామని స్పష్టం చేశారు. అప్పటినుండే ఇటు పాలనాపరంగా అటు పార్టీ పరంగా జగన్ శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఢిల్లీ పర్యటనలు కూడా విస్తృతంగా పెరిగాయి. వీటన్నిటిని బట్టి చూస్తుంటే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నారనే సంకేతాలు రోజురోజుకు బలపడుతున్నాయి. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు వచ్చే ఏడాది మేలో జరగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం అయితే వచ్చే సంవత్సరం ఎన్నికల జరగాలి. అయితే రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయ సంఘటనను బట్టి చూస్తుంటే జగన్ ఆరు నెలల ముందే ఎన్నికలకు వెళ్ళే యోచనలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. పార్టీ వర్గాల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కొంతమంది వైఎస్ఆర్సిపీ సీనియర్ నేతలు తమకు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని అంత అవసరం తమ ప్రభుత్వానికి లేదని చెబుతున్నప్పటికీ లోపల మాత్రం పార్టీ శ్రేణులకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండాలంటూ ప్రతి సమావేశంలోనూ చెబుతూ వస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి దాదాపుగా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా తో గంటన్నర పాటు పైగా భేటీ అవుతూ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు.

అయితే ఆర్థిక వ్యవహారాలతో పాటు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే ఈ నెలలో రెండు వారాల వ్యవధిలోని రెండు సార్లు జగన్ ఢిల్లీ వెళ్లారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో నిర్మల సీతారామన్ తో భేటీ ముగిసిన అనంతరం ఏప్రిల్ మూడో తేదీన ఎమ్మెల్యేలు సమన్వయకర్తలతో వర్క్ షాప్ నిర్వహించాలని ఢిల్లీలో ఉండగానే జగన్ ఆ పార్టీ పెద్దలను ఆదేశించినట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులు ఎవరో ముఖ్యమంత్రి జగన్ ఏప్రిల్ మూడో తేదీన తేల్చేస్తారా అందుకే ఈ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారా? అనేది ప్రస్తుతం ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగే గడపగడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్ లో దీనిపై ఆయన స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు కూడా అంటున్నారు. వాస్తవానికి ఈ నెల 17వ తేదీనే వర్క్ షాప్ నిర్వహించాలని తొలుత అనుకున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆ వర్క్ షాపు జరగలేదు. దీంతో ఏప్రిల్ మూడో తేదీన వర్క్ షాప్ జరుగుతుందని పాలక పక్ష ఎమ్మెల్యేలు ప్రాంతీయ సమన్వయకర్తలు ఎంపీలకు ఇప్పటికే సమాచారం చేరింది. ముఖ్యమంత్రి జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావించినట్లయితే ఈ వర్క్ షాప్ లోనే అభ్యర్థులను ప్రకటిస్తారని అంటున్నారు. మరి ఏప్రిల్ మూడో తేదీన ఏమి జరుగుతుందో అనేది ఉత్కంఠ గా మారింది.