Andhra PradeshHome Page Slider

మైలవరం మంటలపై జగన్ ఫోకస్, ఎమ్మెల్యే వసంతతో భేటీ

సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్ ఫ్యామిలీతోనే…
జగన్ అనుచరుడిగా ఉండటానికి గర్వపడుతున్నా…
సీఎం అన్ని విషయాలు మాట్లాడారన్న వసంత

ఇటీవల మైలవరం నియోజకవర్గంలో రేగుతున్న రచ్చపై సీఎం జగన్ దృష్టి సారించారు. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య మాటల యుద్ధంపై ఆయన రంగంలోకి దిగారు. తనకు ఇద్దరు నేతలు ముఖ్యమంటూనే, కృష్ణ ప్రసాద్ కు జగన్ ఓదార్పు అందించారు. పార్టీలో చిన్న చిన్న సమస్యలుంటాయని… విమర్శలు, ప్రతివిమర్శలు ఉంటాయని జగన్ చెప్పారన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. వచ్చే పాతికేళ్లు తనతో ఉండాలని జగన్ కోరారన్నారు వసంత. తాను రాజకీయాలపై నిరాసక్తంగా మాట్లాడగా.. అలా ఉండొద్దని జగన్ సూచించారన్నారు. రాజకీయాల్లో కొనసాగాలని… గడపగడపకు వెళ్లాలని కోరారన్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను సీఎంకు వివరించానన్నారు ఎమ్మెల్యే. అన్ని విషయాలను జగన్ సావధానంగా విన్నారని…. మారిన పరిస్థితుల్లో వాట్సప్, సోషల్ మీడియా రాజకీయాల ప్రభావంతో ఇబ్బందులొస్తున్నాయని జగన్ చెప్పారన్నారు. సీఎం స్థాయి నుంచి కింద కార్యకర్త వరకు ఇబ్బంది పడుతున్నారన్నారని జగన్ అన్నారని వసంత చెప్పారు. చాలా విషయాలకు ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారన్నారు. సీఎం ఆదేశానుసారం వచ్చే నాలుగైదు రోజుల్లోనే గడపగడప ప్రారంభిస్తానన్నారు. సీఎం చెప్పిన బాటలో నడుస్తూ.. కలిసిక్టటుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామన్నారు. తనది వైఎస్సార్ మాట… జగన్ బాట గతంలోనూ నేను చెప్పానన్న వసంత..

ఊపిరి ఉన్నంత వరకు వైసీపీలో జగన్ నాయకత్వంలో పనిచేస్తానన్నారు. వాస్తవానికి తాను… రాజకీయాలే ప్రాణంగా, ఊపిరిగా పనిచేసే వ్యక్తిని కాననన్నారు. రాజకీయ కుటుంబంలో ఉన్న వ్యాపారస్తుడిగా ఉన్నా… రాజకీయాల్లోకి వచ్చా.. వ్యక్తిగత స్వార్థాలు, అవసరాల కోసం పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. నమ్ముకున్న రాజశేఖర్ రెడ్డి కుటుంబం, జగన్ గారి నాయకత్వంలో పనిచేస్తానన్నారు. మైలవరం నియోజకవర్గంలోగానీ, జిల్లాలో కానీ వైసీపీ పెద్దలు ఏ బాధ్యతలు అప్పగించినా పనిచేస్తానన్నారు. తాను జగన్ ముఖ్య అనుచరుడిగా ఉండటానికి ఇష్టపడతానని, గర్వపడతానని వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. చిరాకుల మధ్య గత దీపావళి ముందు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆపానని… వచ్చే వారం నుంచి తిరిగి ప్రారంభిస్తానన్నారు వసంత. నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించి వ్యక్తిగత కార్యదర్శి ధనుంజయ్ రెడ్డితో మాట్లాడాలని సీఎం చెప్పారని.. కావాల్సిన సహాయసహకారాలు అందిస్తానని సీఎం చెప్పారన్నారు. నియోజకవర్గ వివరాలను తీసుకోవాలని జగన్, ధనుంజయ్ రెడ్డికి చెప్పారన్నారు.