Andhra PradeshHome Page SliderNews

ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాపై జగన్ తుది కసరత్తు

◆ ప్రతి నియోజకవర్గం విషయంలోనూ ఆచితూచి అడుగులు
◆ ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా జాబితా సిద్ధం
◆ పార్టీ ఫస్ట్ లీడర్ నెక్స్ట్ అనే విధంగా జగన్ నిర్ణయాలు
◆ చివరి వర్క్ షాప్ లో ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ప్రకటన ?

ఆంధ్రప్రదేశ్‎లో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీపై మరింత ఫోకస్ పెంచారు. పార్టీ ఫస్ట్ లీడర్ నెక్స్ట్ అనే విధంగా జగన్ నిర్ణయాలు తీసుకుంటూ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు స్వయంగా ఆయనే పరిశీలకుల నియామకం పూర్తి చేశారు. పరిశీలకుల నియామకంలో సీఎం జగన్ స్వయంగా కలుగజేసుకొని ఎంపిక చేయటం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సీఎం జగన్ దగ్గరుండి ఆ జాబితాను తయారు చేయడం వెనుక భారీ లక్ష్యాలే ఉన్నట్లు తెలుస్తుంది. దీంతోపాటు 175 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక పైన కూడా జగన్ సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎంతమందికి సీట్లు దక్కుతాయో ఎంతమందిని పక్కన పెడతారనేది ప్రస్తుతం పార్టీలోని నాయకుల్లో ఉత్కంఠ పెంచుతుంది.

175 నియోజకవర్గాలను క్లీన్ స్వీప్ చేయాలని ముందుకు వెళుతున్న జగన్ ప్రతి నియోజకవర్గం విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అభ్యర్థుల కంటే పార్టీ ముఖ్యమని ఇప్పటికే సీఎం పలుమార్లు స్పష్టం చేశారు. దీంతో తాజాగా ఎమ్మెల్యేల పనితీరు వారిపై ప్రజల్లో ఉన్న ఆదరణ ఆధారంగా నివేదికలు పరిశీలించి జాబితాను తయారు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. డిసెంబర్ నెల ఆఖరిలో జరిగే చివరి వర్క్ షాపులో సీఎం జగన్ ఎటువంటి నిర్ణయాలు ప్రకటిస్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యేలలో ఈసారి తిరిగి ఎంతమందికి సీట్లు దక్కుతాయి సీట్లు కోల్పోయే ఎమ్మెల్యేలు ఎవరు అనేది పార్టీలో ఏ ఇద్దరు కలిసినా చర్చించుకుంటున్నారు. 26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను, రీజినల్ కోఆర్డినేటర్లను నియమించిన జగన్ ఆ తరువాత నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించారు. వాస్తవానికి డిసెంబర్ 4వ తేదీన వైసీపీ వర్క్ షాపు జరగాల్సి ఉంది. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు వారి పనితీరు మెరుగుపరచుకోవటానికి మరొక్క ఛాన్స్ ఇద్దామనే ఆలోచనలో జగన్ వర్క్ షాప్ ను డిసెంబర్ నెల ఆఖరుకు వాయిదా వేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

అదే సమయంలో కొత్తగా నియమితులైన నియోజకవర్గాల పరిశీలకుల ద్వారా ఆయా నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల ప్రజలలో ఎటువంటి అభిప్రాయం ఉంది, స్థానికంగా నాయకులు మధ్య ఏమైనా అభిప్రాయ బేధాలు ఉన్నాయా ఉంటే అవి ఎందుకు వచ్చాయి ఎలా సర్దుబాటు చేయాలి సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో సానుకూలత ఏ మేరకు ఉంది తదితర అంశాలపై మరింత సమాచారం సేకరించి వాటి ఆధారంగా కూడా ఎమ్మెల్యేలు పార్టీ ఇన్చార్జిల పనితీరును తెలుసుకొని ఆ తర్వాత చివరి జాబితా సిద్ధం చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెండు నెలల క్రితం జరిగిన వర్క్ షాప్ లో సీఎం జగన్ ప్రత్యేకంగా ఎమ్మెల్యేల పనితీరు గురించి ప్రస్తావించి 27 మంది ఎమ్మెల్యేలు పనితీరు సరిగా లేదని వారి పేర్లతో సహా ఆ సమావేశంలో వినిపించారు. అందరూ గడపగడప కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం సీఎం జగన్ పలుమార్గాల్లో విభిన్న కోణాల్లో ప్రతి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలపై ప్రజా మద్దతు, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు, స్థానిక ఎమ్మెల్యే పై సానుకూలత తదితరాంశాలపై సమాచారం సేకరించి నిర్ణయాలు ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.

ఈనెలఖారకు జరిగే వర్క్ షాప్‌లో ఎమ్మెల్యేల జాబితాను కూడా జగన్ ప్రకటిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో జగన్ తీసుకునే నిర్ణయాలు కూడా అంతే వేగంగా ఉంటున్నాయి. ఆ క్రమంలోనే ఇప్పటికే విశాఖ గర్జన రాయలసీమ గర్జన నిర్వహించి మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి తమ పార్టీతోనే సాధ్యమనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. దీంతో పాటు బుధవారం బీసీ గర్జన పేరుతో విజయవాడలో పెద్ద మహాసభ నిర్వహించి బీసీ సామాజిక వర్గానికి దగ్గర అవటానికి బీసీ ఓటు బ్యాంకు దెబ్బతినకుండా ఉండటానికి కూడా ప్రణాళికలను రూపొందించుకున్నారు. దీంతోపాటు సీఎంఓలో తన సొంత టీమును, సొంత జిల్లా నుంచి తన సొంత సామాజిక వర్గం నుంచి నియమించుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులను, కోఆర్డినేటర్లను, నియోజకవర్గం పరిశీలకులను నియమించుకున్న జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఆలోచనలోనే ఈసారి జరిగే వర్క్ షాపులో ఎమ్మెల్యే అభ్యర్థులను ముందుగానే ప్రకటించనున్నారనే చర్చ ప్రస్తుతం ఏపీలో విస్తృతంగా సాగుతుంది. మరి సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎంతమందికి ఈసారి టికెట్లు దక్కనున్నాయో చూడాల్సి ఉంది.