Andhra PradeshHome Page Slider

నేటి నుంచి జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం

సంతృప్త స్థాయిలో ప్రజా వినతుల పరిష్కారమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమాన్ని అమలులోకి తెస్తుంది. జగనన్నకు చెబుదాం పేరిట ఈ కార్యక్రమం అమల్లోకి వస్తుంది. 1902 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా నేరుగా సీఎం జగన్ కు సమస్యలను ప్రజలు వివరించే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా లభిస్తోంది. సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని స్వయంగా నేడు ప్రారంభించనున్నారు. ప్రతి వినతి పరిష్కారం అయ్యే విధంగా ఈ కార్యక్రమంలో ట్రాకింగ్ ఉంటుంది.

సంక్షేమ పథకాలు ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత స్థాయిలో ప్రజలకు ఎదురయ్యే సమస్యలకు మరింత మెరుగైన నాణ్యమైన పరిష్కారం చూపాలన్న తపనతో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సంక్షేమ పథకాలు అందుకోవటంలో ఇబ్బందులు ఉన్న, పెన్షన్ కానుకల్లో సమస్యలు ఎదురైన, ఆరోగ్యశ్రీ సేవలు పొందటంలో అవాంతరాలు ఎదురైనా రైతులకైనా అక్క చెల్లెమ్మల కైనా అవ్వ తాతలకు ఇతర ఇబ్బందులు ఉన్న జగనన్నకు చెబుదాం ద్వారా పరిష్కరించుకునే వీలు కలుగుతుంది. రెవెన్యూ రికార్డులకు సంబంధించి ఏమైనా సమస్యలున్న ప్రభుత్వ సేవలకు సంబంధించి మరే ఇతర వ్యక్తిగత ఇబ్బందులు ఉన్న జగనన్నకు చెబుదాం ద్వారా సీఎం జగన్ దృష్టికి తీసుకుని వెళ్ళవచ్చు.

జగనన్నకు చెబుదాము కార్యక్రమంలో టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయగానే కాల్ సెంటర్ ప్రతినిధి సంప్రదింపుల్లోకి వస్తారు. సమస్యను చెప్పగానే ఫిర్యాదు నమోదు చేసుకొని ఐడిని కేటాయిస్తారు. ఎప్పటికప్పుడు అర్జీ స్టేటస్ గురించి ఎస్ఎంఎస్ ద్వారా ఫిర్యాదు దారుకు అప్డేట్ తెలుస్తుంది. సమస్య పరిష్కారమైన తర్వాత ప్రభుత్వ సేవలపై అభిప్రాయాన్ని పంచుకోవడానికి వీలు లభిస్తుంది. ఈ కార్యక్రమాన్ని మంగళవారం సీఎం జగన్ తన కార్యాలయం నుంచి లాంచనంగా ప్రారంభించనున్నారు.