Andhra PradeshHome Page Slider

1.6 కోట్ల కుటుంబాలకు అందనున్న “జగనన్న సురక్ష”

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్న సురక్ష’ కార్యక్రమాన్నిశుక్రవారం  లాంచనంగా ప్రారభించారు సీఎం జగన్. రాష్ట్ర వ్యాప్తంగా 1.6 కోట్ల కుటుంబాల వద్దకు జగనన్న సురక్ష పథకాన్ని తీసుకెళ్లనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. నేటి వరకు పరిష్కారం కాని చిన్న సమస్యను కూడా నేరుగా సీఎం జగన్ కు తెలిపే కార్యక్రమమైన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి కొనసాగింపుగా రాష్ట్రవ్యాప్తంగా 2.6 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లు మరియు 1.5 లక్షల మంది వార్డు సచివాలయ అధికారుల ద్వారా ఈ కార్యక్రమం అమలు చేస్తారు.

ప్రత్యేక పర్యవేక్షణ

జూలై 1వ తేదీ నుంచి 15,004 వార్డు సచివాలయాల్లో దశల వారీగా 30 రోజుల పాటు దాదాపు 3,000 మంది సీనియర్ మండల-స్థాయి ప్రభుత్వ అధికారులచే ఒక రోజు ప్రత్యేక శిబిరాలను నిర్వహించి, వీలైనన్ని ఎక్కువ పౌర సమస్యలను పరిష్కరించడానికి జగనన్న సురక్ష ద్వారా ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు ప్రతి గడపను సందర్శించి ప్రజలకు అర్హత ఉన్నా అందని పథకాలు, వాటికి అవసరమైన ధృవ పత్రాల జారీకి అవసరమైన కార్యాచరణ చేపడతారని సీఎం జగన్ వివరించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల సంక్షేమ విప్లవంలో ఏ ఒక్కరూ లబ్ధి పొందకుండా మిగిలిపోరాదన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు.

జూన్ 24 నుంచి గృహాలను సందర్శించనున్న వలంటీర్లు

వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది రాష్ట్రంలో ఉన్న 1.6 కోట్ల ఇళ్లలో ప్రతి ఇంటినీ సందర్శిస్తారు. అర్హులై ఉండి ఎక్కడైనా లబ్ధి అందనివారుంటే గుర్తించి సమస్య పరిష్కారానికి కావలసిన పత్రాలను సేకరిస్తారు. ఏ తేదీ ఆ గ్రామంలో మండల స్థాయి అధికారులు క్యాంపు నిర్వహిస్తారో తెలియజేస్తారు. క్యాంపు జరిగే రోజు దగ్గరుండి క్యాంపు వద్దకు తీసుకెళ్తారు. సమస్య పరిష్కారమయ్యేలా వారికి తోడుగా ఉంటారు.

జులై 1 నుండి జగనన్న సురక్ష క్యాంపుల ఏర్పాటు

మండల స్థాయి అధికారులైన తహశీల్దార్, ఈవో పీఆర్డీ ఒక టీమ్, ఎంపీడీవో, డిప్యూటీ తహశీల్దార్ రెండో టీమ్ గా ఏర్పడి సచివాలయంలో ఒక రోజు పూర్తిగా గడిపేలా, జులై 1 నుండి ప్రతి సచివాలయంలో క్యాంపు నిర్వహించి అక్కడికక్కడే పథకాల సమస్యలను పరిష్కరించడంతోపాటు సేవా చార్జీలు లేకుండానే అవసరమైన సర్టిఫికెట్లను అందిస్తారు. జనన, మరణ, కుల, ఆదాయ, కుటుంబ, వివాహ ధృవీకరణ పత్రాలు, లావాదేవీ మ్యుటేషన్ లు, ఫోన్ నెంబర్ కు ఆధార్ అనుసంధానం, పంట సాగు కార్డులు, కొత్త రేషన్ కార్డు లేదా రేషన్ కార్డు విభజన, ప్రభుత్వ డేటాకు సంబంధించి కుటుంబ వివరాల్లో మార్పులు చేర్పులు వంటి 11 రకాల సర్టిఫికెట్ లు ఉచితంగా జారీతో పాటు ఇతర అవసరమైన సర్టిఫికెట్లను కూడా అందించనున్నారు.