ఒకే మాట, ఒకే నిబద్ధతతో జగన్
విశాఖ: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు నాయుడు, లోకేష్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు మరో మాట మాట్లాడతారని ఆయన విమర్శించారు. అయితే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎప్పుడూ ఒకే మాట, ఒకే నిబద్ధతతో ఉంటారని తెలిపారు.
విశాఖలో ఈనెల 9న జరగనున్న వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి సోమవారం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ , “జగన్ పర్యటనలో ఏడు నియోజకవర్గాల మీదుగా రోడ్‌షో నిర్వహించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్, షుగర్ ఫ్యాక్టరీ, బల్క్ డ్రగ్ పార్క్ బాధితులను సీఎం జగన్ కలవనున్నారు” అని వెల్లడించారు.
“స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకమే. కేంద్రం చేసే ఈ ప్రయత్నాలను మేము నిరసిస్తూనే ఉంటాం. కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడుకు కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు తెలుసు. ఆయన పేదల కోసం నిజంగా ఆందోళన చెందితే వెంటనే రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు.
“కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత స్టీల్ ప్లాంట్‌లో దాదాపు 10 వేల మంది ఉద్యోగాలు పోయాయి. పేదవారి కడుపు కొడుతూ, ఉచిత వైద్యానికి ఆటంకాలు కలిగిస్తోంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది” అని ఆరోపించారు.
“చంద్రబాబు చీటర్, లోకేష్ లూటర్ అని ప్రజలే మాట్లాడుకుంటున్నారు. ప్రజల సంక్షేమం కన్నా కూటమి లాభాలు మాత్రమే వీరికి ముఖ్యమయ్యాయి. జగన్‌గారు మాత్రం మాట నిలబెట్టుకునే నాయకుడు, ప్రజల కోసం పనిచేసే నాయకుడు” అని వ్యాఖ్యానించారు.
జగన్ పర్యటనలో ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా విని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటారని అమర్నాథ్ తెలిపారు. విశాఖ ప్రజలు జగన్ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.