Andhra PradeshHome Page Slider

విభేదాలను పక్కన పెట్టండి.. పార్టీ శ్రేణులకు వైయస్ జగన్ పిలుపు

అంతర్గత విభేదాలను పక్కనపెట్టి ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏమైనా సమస్యలు ఉంటే పార్టీ వేదికలపై మనలో మనం సర్దుబాటు చేసుకుందామని ఉద్ఘాటించారు. అంతా కలిసికట్టుగా రాబోయే ఎన్నికలలో గట్టిగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. క్యాంపు కార్యాలయంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ దేవినేని అవినాష్ వైయస్సార్సీపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరైన ఈ సమావేశంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజార్టీకి అవసరమైన వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలని జగన్ ఉద్బోధించారు నేతల మధ్య ఎలాంటి విభేదాలున్న పక్కన పెట్టాలని ఈసారి గెలిస్తే మరో 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటామని భరోసా కల్పించారు. మనకు ఓటు వేయని వారి ఇళ్లకు వెళ్ళండి చేసిన మంచిని వారికి వివరిస్తే కచ్చితంగా మార్పు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. మనం వెళ్లకపోతే తప్పు చేసినట్లు అవుతుందని స్పష్టం చేశారు.

ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఆశీర్వాదాలు పొందాలన్నారు కచ్చితంగా 175 కి 175 సీట్లు గెలవాలనేదే తన ఆకాంక్ష అని అన్నారు. రాష్ట్రంలో ఇదే పరిస్థితి కూడా ఉందన్నారు. వార్డులోకి వెళ్లిన గ్రామంలోకి వెళ్లిన ప్రతి ఇంట్లో కూడా సంతోషం కనిపిస్తుందని చెప్పారు. స్కూళ్లు మారుతున్నాయని చదువులు మారుతున్నాయని ఆసుపత్రులు మారుతున్నాయని ఆర్బికేల ద్వారా వ్యవసాయం మారుతుందని ఇంత మార్పు గతంలో ఎన్నడూ లేదన్నారు. వచ్చే ఉగాది నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. విద్యా వైద్య వ్యవసాయం తదితర రంగాల్లో తెచ్చిన మార్పులు పూర్తిస్థాయిలో సత్ఫలితాలిస్థాయని ఆశా భావం వ్యక్తం చేశారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గం కార్యకర్తలతో విడివిడిగా మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశం అవుతున్నాం. నేరుగా కార్యకర్తలను కలుసుకోవటమే ప్రధాన ఉద్దేశం అన్నారు. మరో 14, 15 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయని గడప గడపకు కార్యక్రమంలో మమేకమవుతున్నామని అర్హులు ఎవరైనా మిగిలితే వారికి కూడా మంచి జరగాలన్నారు. సచివాలయాల వారీగా కన్వీనర్లు ప్రతి 50 నుంచి 70 ఇళ్లకు గృహ సారధులను పార్టీ తరఫున నియమిస్తున్నామని పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యులు చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు విజయవాడ ఈస్ట్ లో కూడా 21 వార్డుల్లో 14 చోట్ల గెలిచామని ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నచోట కూడా మనం అధికంగా వార్డులు గెలవగలిగామని నేను బటన్ నొక్కుతా మీరు చేయాల్సింది చేయండని హితబోధ చేశారు.

వచ్చే ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం అభ్యర్థిగా దేవినేని అవినాష్ ను ఎన్నికల బరిలో నిలుపుతున్నట్లు జగన్ ప్రకటించారు. ఈసారి విజయవాడ ఈస్ట్‌లో వైసీపీ విజయకేతనం ఎగుర వేయాలని అవినాష్‌కు అండగా నిలవాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న తూర్పు నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశం నిర్వహించి చర్చించుకోవాలని పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలతో మమేకమై ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. వచ్చేసారి ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించేలా తూర్పు నియోజకవర్గం ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.