మే నెల నుండి జనంలోకి జగన్ ?
• పల్లె నిద్ర ద్వారా ప్రజలతో మమేకం
• తనతో పాటు టీం మొత్తాన్ని ప్రజలతో ఉండేలా ప్రణాళికలు
• ఎన్నికలకు సంవత్సరం ముందే అభ్యర్థుల ప్రకటన
• అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు
ఆంధ్రప్రదేశ్‌లో గత ఆరు నెలలు నుండి నేటి వరకు ఎన్నికల వేడి అంతకంతకు పెరుగుతూ వస్తోంది. మే నెల నుంచి ఎన్నికల ఏడాది కావడంతో ప్రధాన పార్టీలన్నీ సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించాయి. వైయస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ ఇప్పటి వరకు పరిపాలనాపరమైన అంశాల్లో నిత్యం బిజీబిజీగా గడిపినా ఎన్నికల ఏడాది దగ్గర పడటంతో ఆ మేరకు ఒక నిర్దిష్టమైన కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం మే నెల నుండి తనతోపాటు టీమ్ మొత్తం ప్రజలతో మమేకం అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలను, నియోజకవర్గ ఇన్చార్జిలను ప్రజల్లోకి పంపిన ఆయన ఆ మేరకు వచ్చిన ఫలితాలను విశ్లేషించుకుంటూ ఇంకా మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు చేయాల్సిన కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు.

మే నెల నుండి ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం వారికి భరోసా కల్పించడంతోపాటు తన పరిపాలనా కాలంలో ఏం చేశామన్నది ప్రజలకు వివరించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. కరోనా సంక్షోభంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజల చేతికి డబ్బులు అందించడం ద్వారా ప్రతి కుటుంబంలోనూ ఆర్థిక ఇబ్బందులు తొలగించామని ఇది తమకెంతో లాభించే అంశమని దీనిని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని జగన్ నిర్ణయించారు. ఇక సామాజిక న్యాయం మహిళలకు రిజర్వేషన్లు ఇలా అనేక అంశాలతో పాటు ఆసరా, చేయూత పథకాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జగన్ ఆలోచన చేస్తున్నారు. దీంతోపాటు పార్టీలో అసమ్మతి నేతలపై కూడా జగన్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎన్నికలకు దగ్గరగా వెళుతున్న నేపథ్యంలో మే నెలలోనే ఎమ్మెల్యే అభ్యర్థులను జగన్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టికెట్లు ఆశించి భంగపడేవారు పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరించే అవకాశం ఉండటంతో ఈ అంశాన్ని కూడా ముందుగానే ఊహించిన ఆయన పార్టీకి ఎవరు నష్టం చేకూర్చే అవకాశం ఉందన్న దానిపై కూడా ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు.

దీంతోపాటు వారంలో రెండు రోజులు పల్లె నిద్ర ద్వారా ప్రజలతో నేరుగా మాట్లాడేలా కార్యాచరణను రూపొందించాలని పార్టీ పెద్దలకు జగన్ సూచించినట్లు తెలుస్తోంది. పల్లె నిద్ర ద్వారా గ్రామాలకు వెళ్ళినప్పుడు నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఆ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, అనేది వాస్తవ రూపంలో ప్రజలకు వివరించేలా పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ లతోపాటు జగనన్న కాలనీలను ప్రజలకు చూపించి వాటి అభివృద్ధి గురించి వివరించేలా కార్యక్రమం ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని కూడా జగన్ భావిస్తున్నారట. ఈ మేరకు ఇప్పటికే నెలకు నాలుగైదు కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. వారానికి ఒక కార్యక్రమం చొప్పున నాలుగు వారాల్లో నాలుగు కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారట. మొత్తంగా ఈ ఏడాదంతా సీఎం జగన్ ప్రజల్లోనే ఉంటూ తన టీం కూడా ప్రజల మధ్య ఉండేలా పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఎన్నికలకు వెళ్లే విధంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.