మరింత సంక్షేమం అందించే దిశగా జగన్ అడుగులు
ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో వైయస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటినుండే కార్యాచరణను మొదలుపెట్టి ప్రజలకు మరింత సంక్షేమం అందించే దిశగా అడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. గడచిన నాలుగు సంవత్సరాలుగా ఆయన నిరుపేదలకు అందిస్తున్న వివిధ పథకాలకు మరింతగా మెరుగులు దిద్ది రానున్న ఎన్నికల కోసం మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీలో ఉన్న గ్రూపుల సమస్యపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన ఆయన రానున్న ఎన్నికల కోసం మేనిఫెస్టో తయారు చేయడం కోసం నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు.ఈ నిపుణుల కమిటీ ప్రస్తుతం అమలవుతున్న నవరత్నాల పథకాలకు మరింత మెరుగు పెట్టడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో లబ్ధిదారులకు మరింత సంక్షేమం అందించేలా ఈసారి మేనిఫెస్టో ఉండబోతుందని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇందుకోసం రాజకీయంగా సీనియర్లుగా ఉన్న వారితోపాటు వివిధ రంగాల్లో విశేష అనుభవం గడిచిన అఖిల భారత స్థాయి అధికారులు సూచనలు సలహాలు జగన్ తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు అందిస్తున్న సంక్షేమం ఇకపై అందించబోయే సంక్షేమం గురించి అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగిస్తున్న నవరత్నాల కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఇవే పథకాల ద్వారా ప్రజలకు మరింత సంక్షేమం అందించాలన్నది సీఎం జగన్ యోచనగా చెబుతున్నారు. గడపగడపకు కార్యక్రమంలో భాగంగా మహిళల నుండి కొన్ని సూచనలు సలహాలు కూడా ఆ పార్టీ వర్గాలు తీసుకుంటున్నాయి. వీటిని అమలు పరచేందుకు జగన్ కూడా సాధ్యా సాధ్యాలను పరిశీలిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరో రెండు నెలల వ్యవధిలోనే మేనిఫెస్టోకు సంబంధించిన అంశాలు తుదికసరత్తులు పూర్తి చేసుకొని దానికి సంబంధించిన కొన్ని సూచనలను సీఎం జగన్ కు మేనిఫెస్టో కమిటీ అందించనున్నట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికలు ప్రతి పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి అధికార వైయస్సార్ కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం పార్టీ లు కూడా మ్యానిఫెస్టో పై మరింత కసరత్తులు చేస్తున్నాయి. ఎన్నికల నాటికి ఆయా పార్టీలు ప్రకటించే మేనిఫెస్టో అంశాలపై ప్రజలు రానున్న ఎన్నికలలో ఏ పార్టీని విశ్వసిస్తారో వేచి చూడాల్సి ఉంది.
