Andhra PradeshNews

కుప్పం చుట్టు ఏపీ రాజకీయం

◆ ఈనెల 23న కుప్పంకు సీఎం జగన్
◆ వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారులకు మూడో విడత నిధులు పంపిణీ
◆ ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి కుప్పంకు జగన్
◆ జగన్ అసలు టార్గెట్ కుప్పం నియోజకవర్గమేనా ?
◆ ఏం చేశావని కుప్పం పర్యటనకు వస్తున్నావంటున్న చంద్రబాబు

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. ముఖ్యమంత్రి అయ్యాక ఏ రోజు కుప్పం వైపు చూడని వైయస్ జగన్ ఈ నెల 23న తొలిసారి కుప్పం పర్యటనకు వెళ్తున్నారు. రాబోవు ఎన్నికల్లో ఏపీలో 175 కు 175 నియోజకవర్గాలు గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంతో దూకుడుగా ఉన్న జగన్ తన వ్యూహాలకు మరింత పదును పెట్టి తన జిల్లాల పర్యటనను కుప్పం నుండే ప్రారంభించి టీడీపీ అధిష్టానానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో వైఎస్ జగన్ తొలిసారి పర్యటించనున్న నేపథ్యంలో ఇరు పార్టీల్లో ఆసక్తి నెలకొంది. వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారులకు మూడో విడత నిధులను కుప్పం వేదికగా సీఎం విడుదల చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. ఈనెల 22న జగన్ కుప్పం నియోజకవర్గానికి వెళ్లాల్సి ఉండగా అనివార్య కారణాలవల్ల 23కు వాయిదా పడింది.

కుప్పం బహిరంగ సభ వేదికగా వైఎస్ జగన్ ఏం మాట్లాడతారా అనేది ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో తిరుగులేని విజయాన్ని సాధించిన వైసీపీ సీఎం జగన్ పర్యటన విజయవంతం చేయటానికి అన్ని రకాల సన్నాహాలు చేస్తోంది. కుప్పంలో గెలిచి తీరాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న జగన్ ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీకి 66 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులను విడుదల చేశారు. అన్ని నియోజకవర్గాలు ఒక లెక్క కుప్పం ఒక లెక్క అన్నట్లు జగన్ తీరు ఉందని ఆయన వేసే అడుగులు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి వైసీపీ అభ్యర్థులపై ఓటమిపాలయ్యారు. అలానే మంగళగిరిలో పోటీ చేసిన చంద్రబాబు తనయుడు నారా లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆర్కేతో ఓటమి చవి చూశారు. అలానే రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లతోపాటు చంద్రబాబు నాయుడిని కూడా ఇంటికి పంపించాలనే లక్ష్యంతో జగన్ వ్యూహాలు రచిస్తున్నారు.

జగన్ కుప్పం పర్యటన నేపథ్యంలో చంద్రబాబు చిత్తూరులో మంగళవారం పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూడు సంవత్సరాలుగా కుప్పం నియోజకవర్గాన్ని పట్టించుకోని జగన్ కుప్పం నియోజకవర్గానికి ఎలా వస్తారని ప్రశ్నించారు. వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని అందుకే టీడీపీ నాయకులు కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. కేసులకు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని చంద్రబాబు భరోసానిచ్చారు. కుప్పంలో తనని ఓడించటం కాదు ముందు పులివెందులలో గెలిచి చూపించు అని సవాల్ విసిరారు. వైసీపీ రోజు రోజుకు ప్రజా ఆదరణ కోల్పోతుందని కార్యకర్తలు ఎవరు అధైర్య పడాల్సిన పనిలేదని అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. కుప్పంలో ఓడించి చంద్రబాబును ఇంటికి పంపిస్తానని జగన్ సవాల్ విసిరితే పులివెందులలో గెలవలేవని అక్కడ ఓడించి చూపిస్తామని చంద్రబాబు ప్రతి సవాల్ విసరటంతో ఏపీలో రాజకీయ వేడి మరింత పెరిగింది. ఎన్నడూ జరగని విధంగా ఈ సారి ఎన్నికలు జరగబోతున్నాయని, ఏపీలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ఒక ఎత్తుయితే రాబోవు ఎన్నికలు మరొక ఎత్తుని రాజకీయ పండితులు అంటున్నారు.