Andhra PradeshNewsNews Alert

175 స్ధానాలు కొట్టేస్తారా..? చేతులెత్తేస్తారా.. ?

టార్గెట్ పెద్దది. బాగా కష్ట పడాలి. టీడీపీ.. జనసేన.. బీజేపీలను ఎదుర్కొనాలి. ఇప్పటి నుండే పార్టీ సేనలను ఉరుకులు పెట్టిస్తే కానీ .. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేని పరిస్ధితి. దిశా నిర్దేశం చేస్తూ .. పటిష్ట వ్యూహంతో కదిలితే గానీ విజయం దక్కించుకోలా కనిపించడం లేదు. పైకి బీరాలు పలుకుతున్నా ఇదంతా సాధ్యమేనా.. మనసులో ఎక్కడో అనుమానం. కానీ.. సేనలను కదిలించే నేతే ధైర్యాన్ని వీడితే.. అంతా వెనకడుగే. అందుకే .. ఇప్పటి నుండే పార్టీ కేడర్ ను పరుగులు పెట్టించే పనిలో పడ్డారు వైసీపీ నేత జగన్. 175కి 175 గెలవాల్సిందే… నిర్దేశించిన లక్ష్యాన్నివ చేరుకోవాల్సిందే. కఠినంగా హెచ్చరించారు. విన్నవారు విన్నారు. విన్నని వారు ఓకే అని వదిలేశారు. అలాంటి వారిని ఏరి పారేసే పనిలో పడ్డారు . వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించని రీతిలో సుతి మెత్తగా వ్యవహరిస్తూ.. కీలక బాధ్యతల నుండి దూరం పెడుతూ వస్తున్నారు. అలాంటి నియోజకవర్గాలపై దృష్టి పెట్టి అక్కడ అదనపు ఇన్ చార్జీల వ్యవస్ధను ప్రవేశ పెట్టారు. దీనిపై చెప్పుకోలేని ఆవేదనలు, ఆక్రందనలు, ఆందోళనలు మొదలయ్యాయి. పార్టీలో కనిపించని సెగలు రేపుతున్నాయి.


ఆయన సర్వేలు ఆయనకున్నాయి. నివేదికలు ఇచ్చేవారు ఇస్తూనే ఉన్నారు. తాను చేయాల్సింది చేస్తూనే ఉన్నారు. పార్టీని ఈసారి కూడా గట్టెక్కించాలి. 150 నుండి 175 వరకు అన్నింటిలోనూ గెలవాలి. అదో రికార్డు సృష్టించాలి. ఎవరికీ దక్కని అనూహ్యం విజయం తనకే దక్కాలి. గతంలో ఎవరూ సాధించని గెలుపు తాను సాధించి తీరాలి. ఇది ఆయన ఎయిమ్. కోరికలైతే పెద్దవే. కానీ.. తూరుతుందా..? ఓవైపు చాపకింద నీరులా ప్రజా వ్యతిరేకత. మరోవైపు విపక్షాల దూకుడు.. ఇంకోవైపు విమర్శల జోరు. వీటన్నింటినీ తట్టుకుని నిలబడగలమా ? తాము చేస్తున్న పనులు.. అమలు చేస్తున్న పథకాలే తమను గెలిపిస్తాయని ధైర్యం. ఇంకోవైపు ఎక్కడో తెలియని భయం. కొద్దికాలం నుండి ఎదురవుతున్న పరిణామాలు నిద్ర పోనివ్వడం లేదు. గడగడపకూ కార్యక్రమంలో అనేక చేదు అనుభవాలు. దీంతో మొత్తం లెక్కలు కడితే 58 నియోజకవర్గాలు తేలాయి. వీటిలో జాగ్రత్తలు తీసుకోక పోతే వచ్చే ఎన్నికల్లో చేజారే ప్రమాదం ఉందన్న సంకేతాలు ఇప్పుడు జగన్ ను తీవ్రంగా భయపెడుతున్నాయి. అలాగే 12 లోక్ సభా స్ధానాలు కూడా ఉన్నట్లు ఆయన అంచనాల్లో తేలింది. వాటిపైనే ఇప్పుడు గురి పెట్టారు


తనకు అందిన నివేదికల ఆధారంగా 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అదనపు ఇన్ చార్జీలను నియమిస్తున్నారు. ఈ వ్యవహారం కాకరేపుతోంది. పార్టీలో అగ్గి పుట్టిస్తోంది. తాడికొండలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ను ఇన్ చార్జిగా నియమించడంపై సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగానే తన నిరసనను కూడా తెలియపరిచారు. ఇదంతా ఏంటి అంటే .. వారిలో పోటీతత్వాన్ని నింపడం కోసమే అని జగన్ కొత్త భాష్యం చెబుతున్నారు. దీనివల్ల పార్టీ అనుకున్నది సాధించగలదన్నది ఆయన భావన. పోటీ బాగానే ఉంది. ఇదంతా చివరికి వికటంచి అసంతృప్తులు పెరిగి పార్టీకి నష్టం చేకూరుస్తాయేమో అన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఈ పోటీలో ఎవరు నెగ్గితే .. ఎవరు భేషనిపిస్తే వారికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తామని అంటున్నారు.


జగన్ వరకు ప్రజల్లో బలం ఉన్నట్లు కనిపిస్తున్నా .. స్ధానిక ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా కనిపిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు టీడీపీ.. జనసేన పార్టీలు బాగానే బలపడ్డాయి. అయితే ఇప్పుడు వారి నుండి వచ్చే ప్రమాదం కంటే.. సొంత పార్టీ వారి నుండే ఎక్కువగా ప్రమాదం పొంచి ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీన్ని ఇప్పటి నుండే అరికట్టాలని కొత్త కొత్త ప్రయోగాలకు దిగుతున్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు దారికి రావాలంటే.. తాడికొండ లాంటి ప్రయోగాలు తప్పవని అనుకుంటున్నారు. అనేక పర్యాయాలు వర్క్ షాపులు పెట్టారు. ఎమ్మెల్యేలకు తలంటుపోసి .. హితబోధ చేశారు. రెండో పర్యాయం అధికారం దక్కాలంటే ఎమ్మెల్యేల కృషే అవసరం. ప్రజా క్షేత్రంలో ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా ప్రచారం సాగించాలని సూచించారు. వారికి ఆరు నెలలు సమయం కూడా ఇచ్చారు. మారకపోతే ఇక అంతే అంటూ.. వార్నింగ్ కూడా ఇచ్చేశారు. అయితే ఎవరైతే టార్గెట్ లో ఉన్నారో ఆ ఎమ్మెల్యేలంతా ఇప్పుడు నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలంటూ సర్కార్ పై ఒత్తిడి పెంచుతున్నారు. ముఖ్యంగా విపక్షాలు బలంగా ఉన్న నియోజకవర్గాలపైనే దృష్టి పెట్టి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు 12 కోట్ల రూపాయల చొప్పున కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జగన్ ప్రయోగం ఫలించి 175 స్ధానాలు కొట్టేస్తారా.. లేక చేతులెత్తేస్తారా అన్నది చూడాలంటే.. కొంతకాలం ఆగాల్సిందే