Andhra PradeshHome Page Slider

ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇద్దరు నేతలతో చర్చించారు. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలను పరిష్కరించాలని, 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.36,625 కోట్ల రిసోర్స్ గ్యాప్ నిధులను విడుదల చేయాలని, సంబంధిత శాఖలకు తగిన సూచనలు ఇవ్వాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. రాష్ట్ర రుణ పరిమితులపై ఇప్పుడు విధించిన ఆంక్షలపై జోక్యం చేసుకోవాలని వైఎస్ జగన్ మోదీని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిబంధనల ప్రకారం ఇచ్చే రుణ పరిమితిని కూడా తగ్గించారని జగన్, ప్రధాని మోదీ దృష్టికి తీసుకొచ్చారు. 2021-22లో రూ.42,472 కోట్ల రుణ పరిమితిని అందించగా, ఆ తర్వాత కాలంలో రూ.17,923 కోట్లు తగ్గించినట్లు వైఎస్ జగన్ ప్రధానికి తెలిపారు. ఇక హోం మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకొంది. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో… జగన్, ఢిల్లీ వెళ్లి ప్రధాని, హోంమంత్రితోపాటు, కేంద్ర మంత్రులను కలవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.