ఆ ఎమ్మెల్యేలకు, ముగ్గురు మంత్రులకు జగన్ హండ్రెడ్ డేస్ పనిష్మెంట్!
• 30 మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ ఆగ్రహం
• గడపగడపకు తిరగాల్సిందే
• మార్చి 18 నుంచి ‘మా భవిష్యత్తు నువ్వే జగనన్న’
• గడపగడపకు వర్క్ షాప్‌లో సీఎం జగన్ వెల్లడి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి వారికి మరింత చేరువయ్యేందుకు చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతి ఎమ్మెల్యే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజల వద్దకు వెళ్లాలని పదేపదే చెబుతున్నా… కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేల పనితీరులో మార్పు కనిపించడం లేదని కొంతమంది మొక్కుబడిగా అలా వెళ్లి ఇలా వచ్చేస్తున్నారని గ్రాఫ్ పెంచుకోకుండా వెనకబడిపోతే ఇక కష్టమేనని వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేమంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పై వర్క్ షాప్ నిర్వహించారు.

ఈ సమావేశంలో గడపగడపకు కార్యక్రమంలో వెనుకబడ్డ 30 మంది ఎమ్మెల్యేలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వారిలో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు. మరో నలుగురు శాసనసభ్యులు కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే మొక్కుబడిగా గడపగడపకు వెళ్లారు. అనధికార సమాచారం మేరకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, వసంత కృష్ణ ప్రసాద్, కొడాలి నాని, చెన్నకేశవరెడ్డి, బొత్స అప్పల నరసయ్య, చింతల రామచంద్రారెడ్డి, మేకతోటి సుచరిత, జొన్నలగడ్డ పద్మావతి, మద్దిశెట్టి వేణుగోపాల్, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, గ్రంధి శ్రీనివాస్, అన్న రాంబాబు, కాటసాని రామిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, జి .శ్రీనివాస నాయుడు, ఇంకొక ముగ్గురు నియోజకవర్గ సమన్వయకర్తలు గడపగడపకు కార్యక్రమంలో వెనుకబడినట్లు తెలుస్తోంది. వీరంతా తిరిగి మొదట్నుంచి గడపగడపకు కార్యక్రమాన్ని వంద రోజులు పాటు నిర్వహించాలని సీఎం జగన్ పనిష్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అదేవిధంగా మిగిలిన ఎమ్మెల్యేలు కూడా తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని ఈ సందర్భంగా గడపగడపలో దూసుకుపోతున్న మరికొంత ఎమ్మెల్యేలను జగన్ అభినందించినట్లు తెలుస్తోంది. పనితీరులో మార్పు రాకపోతే ఆయా నియోజకవర్గాల్లో కొత్తవారికి అవకాశం కల్పించాల్సి ఉంటుందని దయచేసి అటువంటి పరిస్థితిని తెచ్చుకోవద్దని సీఎం జగన్ పలువురు ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు జగన్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మార్చి 18వ తేదీ నుంచి జగనన్న మా భవిష్యత్తు మీరే కార్యక్రమం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు శాసనసభ్యులను గడపగడపకు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. వర్క్ షాప్‌లో కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారందరికీ వివరించారు.

అదేవిధంగా దాదాపు 5 లక్షల మంది గృహ సారధులను నియమించామని ఫిబ్రవరి 16 లోపు మిగిలిన నియామకాలను పూర్తి చేయాలన్నారు. పార్టీ కార్యక్రమాలు నిరంతరాయంగా జరగాలంటే గృహసారధులే చాలా ముఖ్యమని… సచివాలయం కన్వీనర్లు మొదటి బ్యాచ్ శిక్షణ కార్యక్రమాలు 387 మండలాల్లో కూడా ముగిసాయన్నారు. అదే విధంగా రెండో బ్యాచ్ శిక్షణ కార్యక్రమాలు మిగిలిన మండలాల్లో మంగళవారం నుంచి ప్రారంభించాలన్నారు. అలాగే శిక్షణ కార్యక్రమాలు ముగిసిన తర్వాత క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మార్చి 18 నుంచి 26 వరకు కూడా ‘జగనన్నే మా భవిష్యత్తు’ క్యాంపెయిన్ పార్టీకి చెందిన సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు డోర్ టు డోర్ చేపట్టేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. దీంతోపాటు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూర్తిస్థాయి సీట్లు గెలుచుకునేలా వ్యూహరచన చేయాలని జగన్ దిశా నిర్దేశం చేశారు. మొత్తం తొమ్మిది స్థానిక సంస్థలు మూడు పట్టభద్రుల నియోజకవర్గాలకు రెండు ఉపాధ్యాయ ఎన్నికలతో సహా మొత్తం పార్టీ అభ్యర్థులు గెలిచేలా యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

