సొంత ఎమ్మెల్యేల నమ్మకాన్ని కోల్పోయిన జగన్: చంద్రబాబు
ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో దేవుడు స్క్రిప్ట్ను తిరగరాసాడని ఇక తెలుగుదేశం పార్టీ అన్ స్టాపబుల్ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. 108 నియోజకవర్గాల్లో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలు గెలిచి అధికార పార్టీకి షాక్ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. దీని నుంచి కోలుకునేలాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో దెబ్బ కొట్టామని అన్నారు. సీఎం జగన్ తన సొంత పార్టీ ఎమ్మెల్యేల నమ్మకాన్ని కూడా కోల్పోయారని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్యకర్తలు నేతలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి అభ్యర్థుల విజయానికి కృషి చేశారని వారందరికీ నమస్కరిస్తున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్సిపీ పాలన విధ్వంసాలతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని… అప్పులు అవినీతి అరాచకాలలో మాత్రమే ముందుందన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడంతో పాటు మూడు రాజధానులు చేస్తున్నట్లుగా చెప్పుకోవాల్సిన దుస్థితిని కల్పించారని ఆయన ఒక తిక్కల ముఖ్యమంత్రి అని చంద్రబాబు ధ్యజమెత్తారు. జగన్ ది ధన బలమైతే తెలుగుదేశం పార్టీది జనబలమని ఈ బలం ముందు ఎవరు ఆటలు సాగమన్నారు. రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి బాటలో పయనించాలంటే తెలుగుదేశం పార్టీ గెలుపు తప్పనిసరి అన్నారు. అభివృద్ధి సంక్షేమ అజెండాలతో రాష్ట్రాన్ని బలోపేతం చేస్తామని చెప్పారు. రాష్ట్రమంతట సైకిల్ గాలి వీయాలని అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని ఆదిశగా నేతలు కార్యకర్తలు పని చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.


