ఇప్పటి వరకు 77 అసెంబ్లీ, 23 పార్లమెంట్ ఇన్‌చార్జిలను నియమించిన జగన్
2019 ఎన్నికల్లో అనూహ్య విజయాలు సాధించి, ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ, 2024 ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఏదైనా పార్టీ గెలిస్తే చాల్లే అని అనుకోవడం చూశాం. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటున్నారు. అయితే రాజకీయాల్లో హత్యలు, ఆత్మహత్యలు ఉండవంటారు. అనుకున్నవి అనుకున్నట్టుగా జరగడానికి అవి రాజకీయాలు ఎంత మాత్రం కావు. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరాలని టీడీపీ-జనసేన పార్టీలు, కూటమిలోకి బీజేపీని సైతం తీసుకొచ్చి యుద్ధం చేస్తున్నాయ్. ఏపీలో ఇప్పుడు రసవత్తర రాజకీయం నడుస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిలను మార్చి కొత్త ప్రయోగం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల్ని మార్చకపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందన్న భావన ఉంది. ప్రమాదం తప్పదని తెలిసినప్పటికీ మార్పులు, చేర్పులు చేకపోవడంతో కేసీఆర్ పార్టీ ఇబ్బంది పడింది. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్, పలువురు ఎమ్మెల్యేలను మార్చి, నియోజకవర్గాల్లో కొత్త పోకడలను తీసుకొచ్చారు. ఇప్పటి వరకు వైసీపీ 12 జాబితాలతో అభ్యర్థుల్ని ఖరారు చేసింది. కొన్ని నియోజకవర్గాల్లో నాయకులను పలు మార్లు మార్చి కూడా వైసీపీ ప్రయోగాలు చేస్తోంది. అయితే ఇవన్నీ ఎన్నికల్లో విజయం దక్కిస్తాయా? లేదంటే ఫలితం ప్రతికూలంగా వస్తుందా అన్నది చూడాలి.