Andhra PradeshNews

టీచర్లను అవమానిస్తున్న జగన్ సర్కార్

◆ హాజరు కోసం ఉపాధ్యాయులు కుస్తీలు
◆ ముఖాన్ని గుర్తించలేకపోతున్న యాప్
◆ పిఆర్ సి ఆందోళన పై ప్రభుత్వం రివెంజ్
◆ ససేమిరా అంటున్న ప్రభుత్వం
◆ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయ సంఘాలు

ఉపాధ్యాయుల హాజరు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారానే నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం కక్ష సాధింపమని పలువురు ఆరోపిస్తున్నారు. PRC ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి ఉద్యోగులు ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుందని ఉపాధ్యాయులను పొమ్మన లేక పోగ పెట్టినట్లు సెల్ ఫోన్ లో యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రతిరోజు హాజరు నమోదు చేయాలని ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైన ఆరోజు సెలవు నమోదవుతుందని ఆదేశాలివ్వటం ప్రభుత్వ దుర్మార్గమైన చర్య అని విశ్లేషకులు అంటున్నారు. ఉపాధ్యాయుల ముఖ హాజరుపై వివాదం కొనసాగుతూనే ఉంది.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ తొలిరోజునే విఫలమైంది. కొంతమంది టీచర్లు రెండో రోజు యాప్ లో హాజరు కోసం కుస్తీలు పడగా కొన్నిచోట్ల యాప్ కొంతమంది టీచర్ల ముఖాన్ని గుర్తించలేకపోయింది. మరికొంతమంది టీచర్లు రాష్ట్రవ్యాప్తంగా హాజరు కు యాప్ ని వినియోగించకుండా నిరసన తెలిపారు. యాప్ ను వినియోగించి తీరాల్సిందేనని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించిన వారి మాటను టీచర్లు ఖాతరు చేయలేదు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో తరగతుల విలీనంతో గ్రామ గ్రామాన ప్రాథమిక పాఠశాలలు అల్లకల్లోలమయ్యాయి. ఉపాధ్యాయ సంఘాలు వద్దు అని ప్రభుత్వాన్ని వారించాయి. ఐతే తరగతుల విలీనం ఆచరణలో ఇబ్బందులు, అలానే అనేకమంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు రోడ్డెక్కటంతో ప్రభుత్వం దిగివచ్చి ఆ ప్రక్రియను తాత్కాలికంగా బ్రేక్ వేసింది. అది ముగియక ముందే ఉపాధ్యాయులు యాప్ లో సెల్ఫీ ఫోటోతో హాజరు నమోదు చేయాలని ఒక్క నిమిషం ఆలస్యం కూడా కాకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంలో కూడా ఉపాధ్యాయ సంఘాలు వద్దు అని వారించిన ఇది ఆచరణ సాధ్యం కాదని చెప్పిన కేవలం ఉపాధ్యాయులపై కక్షపూరిత ధోరణితోనే ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లు అనిపిస్తుంది. పిఆర్ సి ఆందోళన అనంతరం ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది , ఎన్ఈ పి పేరిట ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టులు కుదించారు అది చాలాదనట్లు పాఠశాలల సంఖ్యను క్రమంగా తగ్గించటం ,ఇప్పుడు ఏకంగా సర్వీసును ఇబ్బందుల్లో పడేశేలా ఉపాధ్యాయులను మానసిక ఒత్తిడికి గురి చేయటం తదితరాంశాలు ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో ముందుకు వెళ్తున్న అనే వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ప్రభుత్వం ఆచరణాత్మకంగా వ్యవహరించాలి. హాజరు నమోదుకు అవసరమైన పరికరాలు నెట్ సౌకర్యంతో అందించాలి. ప్రభుత్వం రూపొందించిన యాప్ లు ,ఏ డివైస్ లో బాగా పనిచేస్తాయో వాటిని వారే సమకూర్చాలి. ఏజెన్సీ ప్రాంతాలు మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లో లోపాల పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలి. ఏది ఏమైనా ఉపాధ్యాయుని ప్రధాన పని బోధన గా ఉండాలి తప్ప యాప్ లో అప్లోడ్ లు నివేదికల సమర్పణలు కాకూడదు. అసలు ప్రభుత్వమే సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి అది చేయకపోవడంతో హామి అమలు కోసమే ఉద్యోగ ఉపాధ్యాయులు ఉద్యమించారని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి పలువురు మేధావులు, ఉపాధ్యాయ సంఘాలు అన్నట్లు వైసిపి ప్రభుత్వం ఉపాధ్యాయులపై అనచివేత వైఖరి ఇలానే కొనసాగిస్తుందా, ప్రజల్లో ఇప్పటికే టీచర్లు సక్రమంగా పని చేయరు అనే భావనను అలానే ముందుకు తీసుకు వెళ్తుందా, వారి మెర ఆలకించి వారి సమస్యలను పరిష్కరించి వివాదాలకు ఫుల్ స్టాప్ పెడుతుందా అనేది వేచి చూడాల్సి ఉంది.