జగన్ మారిపోయాడు… ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు
కేంద్రంపై పోరాటానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ జంకుతున్నారని ఆయనలో భయం స్పష్టంగా కనిపిస్తుందని జగన్ భయపడటం మొదలుపెడితే రాజకీయ ఓటమి ఎదుర్కోక తప్పదని, పోరాటం ఆపేస్తే జగన్ పతనం మొదలైనట్లేనని అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రాజకీయ విజయాలన్నీటికి ఆయనలోని మొండితనం పోరాటపటిమలే కారణమని ఉండవల్లి విశ్లేషించారు. ఒకప్పుడు దేశంలోని బలమైన నాయకురాలిగా ఉన్న సోనియా గాంధీని ఎదురొడ్డి నిలవడంతోనే జగన్ పట్ల రాష్ట్రంలో సానుకూలత మొదలైంది అని , కేంద్రంపై పోరాడి ప్రత్యేక హోదాతో పాటు విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నిటిని సాధిస్తారన్న విశ్వాసంతోనే జగన్ కు రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని అన్నారు. 22 లోక్ సభ , 151 అసెంబ్లీ సీట్లలో ప్రజలు విజయం చేకూర్చారని పేర్కొన్నారు.

కానీ ఇప్పుడు జగన్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నారని విభజనకు సంబంధించిన అంశాలని ఇక వదిలేయాలంటూ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫడవిట్ దాఖలు చేయడంతో జగన్ లోని పోరాట పటిమ నిర్వీర్యం అయ్యిందనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందని స్పష్టం చేశారు. విభజన హామీల అమలు కోసం సుప్రీంకోర్టులో జరుగుతున్న వ్యాజ్యాల నడుమ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ అంశాన్ని వదిలేయండి అంటూ అఫడవిట్ దాఖలు చేసిందని చెప్పారు. ఎవరి ప్రయోజనాలు పరిరక్షణ కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటూ ఆయన ప్రశ్నించారు విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్ తీవ్ర అన్యాయం జరిగిందని ఇది ఎవరు కాదనని నిజమని పేర్కొన్నారు. విభజన హామీల అంశంలో కేంద్ర ప్రభుత్వంపై జగన్ ఒత్తిడి తేవాలని అవసరమైతే న్యాయపోరాటం చేయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఈ విషయంలో ప్రజలను చైతన్య పరిచే ప్రయత్నాలు చేశారని ఆ కారణంగానే ఆయనను ప్రజల విశ్వసించారని కానీ ఇప్పుడు ఆయనలో పోరాటపటిమ తగ్గిందని ఇక పోరాటం చేస్తారన్న నమ్మకం ప్రజల్లో సడల్తుందని ఇదే పరిస్థితి కొనసాగితే జగన్ రాజకీయ జీవితానికి పుల్ స్టాప్ తప్పదంటూ ఉండవల్లి పేర్కొన్నారు.

