Andhra Pradesh

వికేంద్రీకరణకే జగన్ మొగ్గు

◆ మూడు రాజధానుల పై కొత్త బిల్లు సిద్ధం ?
◆ నేటి నుండి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
◆ అస్త్ర శాస్త్రాలతో సిద్ధమైన అధికార, ప్రతిపక్షాలు
◆ తొలిరోజే మూడు రాజధానులపై చర్చకు వైసీపీ సన్నాహాలు

ఏపీలో ఒకవైపు అమరావతిని రాజధానిగానే ఉంచాలని ఆ ప్రాంత రైతులు పాదయాత్ర చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్ మాత్రం తాను అనుకున్న పాలన వికేంద్రీకరణ పైనే దృష్టి సారించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. నేటి నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో తొలిరోజే మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన యోచిస్తున్నారు. న్యాయనిపుణుల సూచనలు సలహాలతో మూడు రాజధానుల బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకోవాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. ఇదే సందర్భంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ మరొక్కసారి మూడు రాజధానుల బిల్లు పై వ్యతిరేకంగా పోరుకు సన్నద్ధమైంది.

2019 డిసెంబర్ 17న సభలో మూడు రాజధానుల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టింది. ఆ సభలోనే ఆ బిల్లుకు ఆమోదం తెలిపింది. అయితే అప్పట్లో శాసనమండలలో టీడీపీకి బలం ఎక్కువగా ఉండటంతో మూడు రాజధానుల బిల్లును ఆ పార్టీ అడ్డుకుంది. ఈ నేపథ్యంలోనే సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపుతున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం గవర్నర్ కూడా వాటికి ఆమోదం తెలిపారు. అయితే మూడు రాజధానుల బిల్లుపై రైతులు కోర్టుకు వెళ్ళటం ఆ బిల్లులో కొన్ని సాంకేతికపరమైన లోపాలు ఉండటంతో గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును తాత్కాలికంగా ఉపసంహరించుకుంది. అయితే ఆ లోపాలను సరిచేసి ఇదే సభలో కొత్త బిల్లు ప్రవేశపెడతామని అప్పట్లో సీఎం జగన్ స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో నేటి నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇదే విషయాన్ని వైసీపీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఆ పార్టీ సీనియర్ నేతలతో పాటు మంత్రులు కూడా ఇదే అంశాన్ని అధికారికంగా ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానుల బిల్లుపై వెనక్కి తగ్గేదే లేదని వారు వెల్లడిస్తున్నారు. దీంతో వారం పాటు జరగనున్న సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టడంతో పాటు మొదటి రెండు మూడు రోజుల్లోనే సీఎం జగన్ మూడు రాజధానుల బిల్లుపై ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం ఈ బిల్లును అడ్డుకునేందుకు సంసిద్ధమైంది. రాజధాని అంశంలో అసెంబ్లీని రద్దు పరచాలని మూడు రాజధానుల అంశాన్ని రెఫరెండంగా తీసుకొని ఎన్నికలకు వెళ్లాలని అసెంబ్లీలో అధికార పక్షానికి సవాలు విసరాలని ఆ పార్టీ నిర్ణయించింది. రాజధాని అంశంలో వైసీపీ మాట తప్పిందని ఆ పార్టీ అంటుంది.

అధికార పార్టీ మాత్రం అమరావతి ఏకైక రాజధానిగా ఉండటం వల్ల అభివృద్ధి అక్కడే కేంద్రీకృతం అవుతుందని నిర్మాణాలు మౌలిక వసతులు ఏర్పాటుతో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని ఫలితంగా ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు అన్యాయం జరగటంతో పాటు ప్రాంతీయ వైషమ్యాలు పెరిగే ప్రమాదం ఉందని అందుకే తమ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని అంటోంది. మరి కీలకమైన మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ఎటువైపు మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.