NewsTelangana

మునుగోడులో గెలిపిస్తేనే అభివృద్ధి అంటున్న జగదీశ్‌రెడ్డి

మునుగోడు అభివృద్ధిపై రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి కొత్త గళం విప్పారు. ఇంతకాలం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అన్న సాకుతో మునుగోడును పట్టించుకోని టీఆర్‌ఎస్‌ సర్కారు ఉపఎన్నిక కోసమైనా అభివృద్ధి చేస్తుందని ఆ ప్రాంత ప్రజలు ఆశించారు. కానీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాటలతో ఆ ఆశ కూడా నీరుగారే పరిస్థితి ఏర్పడింది. హుజూరాబాద్‌లో ఉప ఎన్నికకు ముందు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మునుగోడులో మాత్రం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపిస్తేనే అభివృద్ధి చేస్తామని మెలిక పెట్టింది.

పైగా ఇప్పుడు అభివృద్ధి చేస్తే విపక్షాలు దీన్ని అవకాశంగా తీసుకుంటాయని మంత్రి జగదీశ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు నచ్చ చెబుతున్నారు. మునుగోడు అభివృద్ధి తన బాధ్యత అన్నారు. నిజానికి రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న చోటే సీఎం కేసీఆర్‌ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారనే ప్రచారం ఉంది. ఈసారి మాత్రం ట్రెండ్‌ మార్చి.. ఎన్నికలున్నా అభివృద్ధి పనులు చేయబోమని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపిస్తేనే అభివృద్ధి చేస్తామంటూ టీఆర్‌ఎస్‌ సర్కారు కొత్త గళం విప్పింది. దీంతో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగాలంటూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.