నేను పార్టీ మారడం అవాస్తవం
తాను పార్టీ మారుతున్నానని వచ్చే వార్తలు అవాస్తవం అని రాజ్యసభ సభ్యులు తూర్పు గోదావరి జిల్లా వైసీపీ పార్టీ సమన్వయకర్త పిల్లి సుభాష్ కీలక వ్యాఖలు చేసారు. రామచంద్రాపురం లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తల్లో వ్యక్తమవుతున్న విషయాలనే తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లానని ఆలా చెయ్యడం తన భాద్యత అని తెలియజేసారు. పార్టీ మారుతున్నానని వచ్చే వార్తలు అవాస్తవం అని చెబుతూ గత పది సంవత్సరాలలో దివంగత నేత వై ఎస్ రాజాశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్, వైసీపీ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ పునాది నుండి తానూ ఒక పిల్లర్ గా ఉన్నానని తెలియజేసారు. ఈ సందర్బంగా తానూ ఎంపీ పదవికి రాజీనామా చేసి పార్టీ వీడతా అనడం బాధాకరం అని దానికి ముఖ్యమంత్రికి క్షమాపణలు చెప్పారు. అలాగే తన మనస్సులో ఉన్న ప్రతి విషయాన్నీ ముఖ్యమంత్రికి తెలియజేసానని దాని గురించి ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి నిర్వహించే సర్వే ఆధారంగానే సీటు ఇవ్వబడుతుంది వైఎస్ జగన్ సరైన నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం ఉందని, ఆయన హామీ ఇచ్చారని పిల్లి సుభాష్ చెప్పారు. రామచంద్రాపురంలో ఎవరి పని వారిదని మంత్రి వేణు ని ఉద్దేశించి అన్నారు. తాను, వేణు ఇద్దరు ఎవరి పని వారు చేసుకుంటామని తెలియజేస్తూ కార్యకర్తలకు మంచి జరుగుతుందని స్పష్టం చేశారు. పార్టీ నిర్మాణానికి, కృషికి పని చేయాలని ఆయన తన అనుచరులకు సూచించారు. రామచంద్రాపురంలో ఎవరిని అభ్యర్థిగా నిలిపినా తనకు అభ్యంతరం లేదని, జగన్ నుంచి పాజిటివ్ నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. ఈ వ్యాఖ్యలతో గత రెండు వారాల నుండి రామచంద్రాపురం నియోజకవర్గం చుట్టూ రాజుకున్న సీటు వివాదానికి తెరదింపినట్లయ్యింది.