మొహమాటంగా.. ఎడమాటంగా ఓటేస్తే ప్రమాదం
ఆలోచించి ఓటేయాలని, ఎడమాటంగా.. మొహమాటంగా ఓటేస్తే ప్రమాదమని సీఎం కేసీఆర్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చండూరులో ప్రసంగించారు. ‘ఇవి అనవసరపు ఎన్నికలు. నాలుగు విషయాలు మీ ముందు చెప్పాలని ఇక్కడికి వచ్చాను. ఎలక్షన్లు రాంగనే ఏదో మాయరోగం మనకు పట్టుకుంటుంది. మాయ మాయ.. గాయి గాయి.. గత్తర గత్తర చేస్తారు. విచిత్ర వేషధారులు, డ్యాన్సులు చేసేవాళ్లు అనేక మంది వస్తరు. ఏదేదో చెబుతారు. వాళ్లకు గాయి గాయి.. గత్తర గత్తర ఉంటుంది. మనకు ఎందుకు ఉండాలని నేను మిమ్ములను అడుగుతున్నాను. ఇక్కడ నేను చెప్పింది కాదు.. తమ్మినేని, సాంబశివ రావు చెప్పిందీ కాదు.. మేము వెళ్లిపోయిన తర్వాత మీరు కూర్చొని ఆలోచించాలి. ఓటు ఆలోచించి వేయాలి. అలవోకగా.. తమాషాగా వేస్తే ఇల్లు కాలిపోతది. మొహమాటంగా.. ఎడమాటంగా ఓటేస్తే పెద్ద ప్రమాదం. దేశంలో ఉన్నది ప్రజాస్వామ్యం. అయితే.. మన దేశంలో ఏం జరుగుతుందో ఒకసారి మనస్సుతో ఆలోచించాలి. కరిచే పాము అని చెప్పి మెడలో వేసుకుంటామా.. మేం కరుస్తాం.. అయినా మాకే ఓటేయాలంటే లొంగిపోవద్దు. ఎన్ని విభేదాలు ఉన్నా.. ఓటు మాత్రం చైతన్యంతోనే వేయాలి. మాటలకు, ప్రలోభాలకు లొంగేదిలేదని చెప్పే వరకూ మనల్ని దోపిడీ దారులు దోచుకుంటారు’ ఓటర్లను కేసీఆర్ హెచ్చరించారు.