హుజురాబాద్ రైతులకు ఈటల రాజేందర్ భరోసా
ఈ మధ్య కురిసిన అకాల వర్షాల వల్ల తెలంగాణా వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. వడగళ్లవానల వల్ల వారి పంటలకు నష్టం వాటిల్లింది. చేతికి రాబోతున్న పంటలు నీటిపాలయ్యాయి. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించిన అక్కడి రైతులకు భరోసా కల్పించారు.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఈ అకాల వర్షాలు వడగళ్ల వానలకు గోరుచుట్ట మీద రోకటిపోటు లాగా రైతుల నడ్డి విరిచాయి. అనేక కష్టాలుపడి పెట్టుబడులు బయట తెచ్చుకుని సాగు చేస్తున్న రైతులకు తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలతో మొక్కజొన్న పంట లక్షల ఎకరాల్లో చేతికి రాకుండా పడిపోయిందన్నారు. పొట్టకొచ్చిన వరి చేనులు రాళ్ల దెబ్బలకు పొట్టలు పగిలిపోయాయి, ఇంత విపత్తు జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు తూతూ మంత్రంగా స్పందిస్తున్నారు తప్ప రైతన్నకి భరోసా ఇవ్వడంలేదని మండిపడ్డారు.

ప్రగతిభవన్లో కూర్చున్న ముఖ్యమంత్రి గారు సమీక్షల పేరిట ముసలి కన్నీరు కారుస్తున్నారు తప్ప రైతాంగాన్ని ఆదుకోవడం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విపత్కార పరిస్థితుల్లో ఫసల్ బీమా తీసుకువచ్చిందని, దీనివల్ల రైతులు నష్టపోయినప్పుడు ఆదుకునే వెసులుబాటు కల్పించారు. కానీ ముఖ్యమంత్రి గారు రైతుబంధు ఇస్తున్న పేరుతో ఫసల్ బీమాకు రాష్ట్ర ప్రభుత్వాన్ని తరుపున కట్టాల్సిన డబ్బు కట్టకపోవడం వల్ల ఫసల్ బీమా రావటం లేదని ఎద్దేవా చేశారు. ఇళ్లల్లో మనిషి చచ్చిపోతే ఎలా విషాదంగా ఉంటారో.. పంట కోల్పోయిన రైతులు కూడా అంతే విషాదంగా ఉన్నారన్నారు.

కమలాపూర్ మండలం, ఇల్లంతకుంట మండలం, జమ్మికుంట వీరవంక మండల గ్రామాల్లో వేల వేల ఎకరాలలో పాలు పోసుకుంటున్న మొక్క కంకులు నేలపాలయ్యాయి. అధికారులు అంచనాల కోసం తూతుమాత్రంగా రాసుకోకుండా రైతు వారిగా విస్తరణ అధికారులతో, రెవెన్యూ అధికారులతో కలిసి పంట నష్ట అంచనాల సర్వే చెయ్యాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నానన్నారు.

కేంద్ర ఫసల్ బీమా యోజన ఉంటే ఎలాంటి సహకారం వస్తుందో అలాంటి సహకారమే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించాలని కోరుతున్నారు. తాను ఈరోజు అంబాల, శ్రీరాములపల్లె, గునిపర్తి, శనిగరం, వంగపల్లి గ్రామంలో ఇళ్ళందకుంట మండలం మల్యాల, లక్ష్మారెడ్డి పల్లిలో పర్యటించానన్నారు. కలెక్టర్ గారితో మాట్లాడి మరిన్ని టీములు ఎక్కువ పెట్టించి సర్వే చేయించే ప్రయత్నం చేస్తానని బాధితులకు ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి గారు రాజకీయాలను పక్కనపెట్టి బాధ్యతగా వ్యవహరించాలని బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.