Home Page SliderTelangana

తెలంగాణ భక్తుల పట్ల టీటీడీ నిర్లక్ష్యం చేయడం బాధాకరం

తిరుమలలో తెలంగాణ భక్తుల పట్ల గత ప్రభుత్వం నుంచే నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తెల్లవారుజామున శ్రీశైలం మల్లిఖార్జున స్వామి సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తమ దురదృష్టం వల్ల శ్రీశైల క్షేత్రాన్ని కోల్పోయామని, రాష్ట్రాలు విడిపోవడంతో ఇవ్వాల్సి వచ్చిందని, కానీ భక్తి మాత్రం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. టీటీడీ విషయంపై ప్రస్తుత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని ఆమె వెల్లడించారు. తెలంగాణ వారికి గతంలో దక్కిన విధంగానే ప్రాధాన్యం ఉండాలని కోరారు. టీడీపీ హయాంలో అమలు చేసిన నిబంధనలను అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. తిరుమలలో తెలంగాణవారిపై వివక్ష చూపిస్తున్నారని కొద్దిరోజుల క్రితం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారగా.. తాజాగా మంత్రి కొండా సురేఖ సైతం అలాగే మాట్లాడటం చర్చానీయాంశంగా మారింది.